Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సున్నితంగా తిరస్కరించిన రెజ్లర్లు
- పదోరోజు మల్లయోధుల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలనే డిమాండ్‌తో న్యూఢిల్లీలో భారత అగ్రశ్రేణి రెజ్లింగ్ క్రీడాకారులు చేపట్టిన ఆందోళన పదో రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా.. ఇప్పటివరకు బిజెపి ఎంపీని అరెస్టు చేయలేకపోవడానికి కారణం ఏంటని? లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి బయట స్వేచ్ఛగా తిరుగుతూ, భయభ్రాంతులకు గురి చేస్తుంటే కుస్తీ పట్టేందుకు ఎలా వెళ్లగలమని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పది రోజులుగా భారత స్టార్ మల్లయోధులు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నప్పటికి ప్రధానమంత్రి నరెంద్ర మోడి స్పందించటం లేదు. రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసిన భారతీయ జనతా పార్టీ ఎంపీని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు వచ్చినా.. ఎటువంటి చలనం లేదు.
ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించేందుకు మంగళవారం దీక్ష స్థలి వద్దకు వచ్చారు. బజరంగ్ పూనియాకు ఇద్దరు.. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్‌లకు ఒకరు చొప్పున వ్యక్తిగత భద్రతా అధికారులను స్థానిక ఏసీపీ నియమించారు. భద్రత కోసం అధికారులు జంతర్‌మంతర్‌కు వచ్చినా.. రెజ్లర్లు సున్నితంగా తిరస్కరించారు. 'మేము మా సోదరులు, సోదరీమణులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. జంతర్‌మంతర్ వద్దే మాకు రక్షణ లేకుంటే మరో చోట ఎలా ఉంటుంది? మాకు ఎటువంటి భద్రత అవసరం లేదు' అని వ్యక్తిగత భద్రతా అధికారులను నిరాకరించారు.
ఇక న్యూఢిల్లీలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షానికి రెజ్లర్ల పరుపులు పూర్తిగా తడిసిపోయాయి. ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది. అయినా, రెజ్లర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనను మరింత ఉదృతంగా కొనసాగిస్తున్నారు.