Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌహతి హైకోర్టులో కేంద్రం వాదనలు
గౌహతి : విదేశీయులుగా ప్రకటించిన వారికి సంక్షేమ పథకాలేవీ వర్తించవని, వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్రం గౌహతి హైకోర్టులో వాదనలు విన్పించింది. అసోంలో విదేశీయుడిగా ప్రకటించబడిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గౌహతి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆర్కేడీ చౌదరి వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద మాత్రమే విదేశీయులకు రక్షణ లభిస్తుందని తెలిపారు. జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఈ అధికరణ కల్పిస్తోంది. విదేశీయులకు దేశంలోని భూములపై యాజమాన్య హక్కులేవీ ఉండవని చౌదరి స్పష్టం చేశారు. ఒకవేళ విదేశీయులకు అలాంటి ఆస్తులేవైనా ఉంటే అవి వారికి విక్రయించిన వారికి కాకుండా ప్రభుత్వానికే చెందుతాయని చెప్పారు. విదేశీయులుగా ప్రకటిం చిన వారి హక్కులు, ఆస్తులకు సంబంధించిన కేసు ఫిబ్రవరిలో కోర్టు ముందుకు వచ్చింది. మహమ్మద్ మైనుల్ హక్ అనే వ్యవసాయ కార్మికుడు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. హక్ అసోంకు చెందిన వ్యక్తిగా తనను తాను నిరూపించుకోలేక పోయాడని చెబుతూ ఒక ట్రిబ్యునల్ ఆయనను 2016లో విదేశీయుడిగా ప్రకటించింది. ట్రిబ్యునల్ తీర్పును హైకోర్టు సమర్ధించింది. నాలుగేళ్ల తర్వాత ...సరిహద్దు పోలీసులు తనను అక్రమ వలసదారుగా గుర్తించారంటూ 2022లో హక్ మరోసారి ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతుండగానే హక్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా గౌహతి కోర్టులో న్యాయమూర్తి బారువా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విదేశీయులుగా ప్రకటించబడిన వారు దేశంలో కొంతకాలం ఉండాలంటే వారి పట్ల మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. వారికి విద్యను కూడా అందించాలని, వారు దేశానికి మేలు చేస్తారని అనుకుంటే వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు.