Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫ లమైంది. 2014 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ యువతకు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నోటిమాటగానే మిగిలిపోయింది తప్ప.. ఆచరణలో అమలుకాలేదు. రెండోవిడత ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తాత్కాలికంగా అగ్నిపథ్ స్కీమ్ కింద కొన్ని ఉద్యోగ నియామకాలకు ఆదేశాలు జారీచేసినా.. అవి కూడా పూర్తి స్థాయిలో యువతకు ఉద్యోగాల్ని కల్పించలేదు. ఒకపక్క దేశ జనాభాలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్‌వన్ స్థానంలో నిలిచిన భారత్... ఉపాధి కల్పనలో మాత్రం మిగతా దేశాలతో పోటీపడలేకపోతోంది. ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 7.8గా ఉంది. ఇక ఏప్రిల్ నెలకు 8.11 శాతానికి నిరుద్యోగిత రేటు పెరిగింది. అదే సమయంలో మార్చిలో 8.51 శాతంగా పట్టణ నిరుద్యోగ రేటు ఏప్రిల్‌కి 9.81 శాతానికి పెరిగింది. అయితే గ్రామీణ నిరుద్యోగం మాత్రం స్వల్పంగా తగ్గింది. మార్చిలో 7.47గా ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్ నెలకు 7.34 శాతం నమోదైనట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకనామీ పరిశోధనా సంస్థ వెల్లడించిన తాజా సమాచారం తెలిపింది.