Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ప్రభుత్వం, గ్రేటర్ నోయిడా అథారిటీ ఒప్పందాన్ని అమలు చేయాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యూపీ ప్రభుత్వం, గ్రేటర్ నోయిడా అథారిటీ ఒప్పందాన్ని అమలు చేయాలని మంగళవారం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు గ్రేటర్ నోయిడా డెవలప్మెంట్ అథారిటీ ఎదుట మహాపంచాయత్ నిర్వహించారు. గ్రేటర్ నోయిడా అథారిటీ గేటు వద్ద గత ఎనిమిది రోజులుగా రైతులు నిరవధిక ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ఎనిమిదో రోజు ఈ మహాపంచాయత్ నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నాను కొనసాగిస్తామని, పోరాటాన్ని ఉధృతం చేస్తామని, గౌతమ్‌బుద్ నగర్‌లోని ప్రతి గ్రామంలోనూ విస్తరింపజేస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మహా పంచాయతీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ పోరాటాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహాపంచాయత్‌కు స్థానిక సీనియర్ కిసాన్ నాయకుడు జగదీష్ లంబెర్దార్ అధ్యక్షత వహించారు. ఏఐకేఎస్ కోశాధికారి పి కృష్ణప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యులు సభ్యులు పుష్పంద్ర త్యాగి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ బుద్ నగర్ కిసాన్ సభ నాయకుడు రూపేష్ వర్మ, వీర్ సింగ్ నగర్, నరందర్ భాటి, బిజాందర్ తదితరులు కూడా ఈ పంచాయితీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆజాద్ సమాజ్ పార్టీ, బెరోజ్గర్ కిసాన్ సంఘటన్, సమాజ్‌వాదీ పార్టీ, బీకేయూ స్థానిక నాయకులు కూడా పాల్గొని మహాపంచాయత్‌లో ప్రసంగించారు.
రైతులు డిమాండ్లు
1. ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లలో 10 శాతం రైతులకు కేటాయించాలి.
2. కొత్త చట్టం ప్రకారం గ్రామం సర్కిల్ రేటును నాలుగు రెట్లు పెంచాలి. చదరపు మీటరుకు రూ. 24,000 పరిహారం ప్రకటించాలి.
3. తిరస్కరించిన నివాసితుల కేసులు, పెండింగ్ కేసులను విచారించాలి. లీజు బ్యాంకు చర్యను వెంటనే తీసుకోవాలి.
4. అథారిటీ అన్ని రెసిడెన్షియల్ పథకాలలో 17.5 శాతం కిసాన్ కోటా అందించాలి.
5. రైతులతో 1997 ఒప్పందం ప్రకారం 10 శాతం జనాభాకు ప్లాట్లు ఇచ్చే విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
6. 120 చదరపు మీటర్ల కనీస ప్లాట్ సైజు విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
7. భూమి లేని కుటుంబాలకు పట్వారీ ఒప్పందం ప్రకారం 40 చదరపు మీటర్ల ప్లాట్లు ఇవ్వాలి.
8. స్వాధీన చట్టం, పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, తప్పనిసరి ఉపాధి విధానాన్ని అమలు చేయాలి.
9. బాధిత కుటుంబాలకు అధికార ప్రాంతంలో ఉచిత విద్య, చికిత్స సౌకర్యం కల్పించాలి.