Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
- పలు జిల్లాల్లో నేతల గృహనిర్బంధం, అక్రమ అరెస్టులు
విశాఖ :ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన ఆందోళనపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పలు జిల్లాల్లో వామపక్ష పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. రాస్తారోకోలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. విజయవాడ బందరు రోడ్డులోని పశువుల ఆస్పత్రి నుండి వారథి వైపు వెళ్తున్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, కె ప్రభాకర్‌రెడ్డి, ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న, సిపిఐ నాయకులు వీరభద్రరావు తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి భవానీపురం స్టేషన్‌కు తరలించారు. పోలీసు వాహనంలో విచక్షణారహితంగా ఎత్తిపడేయడంతో ఎస్ఎఫ్ఐ ఎన్టిఆర్ జిల్లా అధ్యక్షులు సోమేశ్వరరావు మోచేతికి ఇనుప రాడ్ గీసుకుపోయి రక్తస్రావమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ నేతలు స్టేషన్లోనూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్‌పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. ప్రయివేట్ స్టీల్ ప్లాంట్లకు సొంత ఉక్కు గనులు కేటాయించిన కేంద్రం... ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించకపోవడం తగదని తెలిపారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం శోచనీయమన్నారు. కేంద్రంతో పోరాడి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు కలిసి రావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు విశాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే, అదానీ పంపిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరామర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రతిపక్షాలు నిర్వహిస్తోన్న పోరాటానికి వైసిపి మద్దతు ఇవ్వాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులు వి.ఉమామహేశ్వరరావు, రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ (ఎంఎల్) నాయకులు హరినాథ్ తదితరులను మంగళవారం రాత్రి నుండే పోలీసులు గృహనిర్బంధం చేశారు. గన్నవరం తదితర ప్రాంతాల్లో అఖిలపక్ష రైతు సంఘాలు, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేశారు. పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు.
విశాఖలో పలుచోట్ల రాస్తారోకోలు జరిగాయి. మూడు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. గాజువాకలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహా 16 మందిని, కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ బి.ఆదినారాయణ, పోరాట కో-కన్వీనర్ జె.అయోధ్యరాం తదితర కార్మిక నాయకులను, 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు సహా 26 మందిని, మద్దిలపాలెంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు సహా 25 మందిని, అనకాపల్లిలో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ఆప్, కాంగ్రెస్ పార్టీ నాయకులను పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పెదగంట్యాడ, గాజువాకలో జరిగిన కార్యక్రమాల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్‌పరం కానివ్వబోమన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వామపక్ష, సిఐటియు, ఎఐటియుసి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సిఐటియు, ఎఐటియుసి, సిపిఎం, సిపిఐ నాయకులను, గుంటూరులో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, జంగాల అజరుకుమార్లను, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిపిఎం జిల్లా గుంటూరు విజయకుమార్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాస్తారోకో సందర్భంగా పోలీసులకు, కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పోలీసులు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.
అక్రమ అరెస్ట్‌లను
ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ
అక్రమ అరెస్టులను, గృహ నిర్బంధాలను సిపిఎం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ఖండించింది. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించి ముందుకు నడపాల్సింది పోయి నిర్బంధానికి పూనుకోవడం సిగ్గుచేటని పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు పోరాడుతు న్న వారిపై నిర్బంధం ప్రయోగించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కుయుక్తులకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం గర్హనీయమని విమర్శించింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెగనమ్మేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, వీటిని తిప్పికొట్టాలని కోరింది. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో ఉత్తరాంధ్రలో ట్రేడ్ యూనియన్, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.