Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వర్షంలోనూ కొనసాగిన రెజ్లర్ల ఆందోళన
- మద్దతుగా విద్యార్థుల ర్యాలీ.. పోలీసుల దాడి
- విద్యార్థినులను సైతం ఈడ్చిపారేసిన ఢిల్లీ పోలీసులు
- దాడిని ఖండించిన మల్లయోధులు, విద్యార్థి నేతలు
- రెజ్లర్ల వద్దకు పిటి ఉష
భారీ వర్షంలోనూ రెజ్లర్ల ఆందోళన కొనసాగుతున్నది. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి మద్దతుగా విద్యార్థులు బుధవారం నిర్వహించిన ర్యాలీపై ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. వేధించిన దోషి స్వేచ్ఛగా తిరుగుతుంటే.. ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. తద్వారా రెజ్లర్లను పరోక్షంగా హెచ్చరించారు. అయినప్పటికీ రెజ్లర్లు మొక్కవోని దీక్షతో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళన 11వ రోజూ కొనసాగింది. నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు సహా ప్రముఖ నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. కాగా, ఆందోళన శిబిరాన్ని సందర్శించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆందోళనకారుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. పిటి ఉష తిరిగి వెళుతుండగా... ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ పునియా మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ జైలుకు వెళ్లే వరకు తాము ఇక్కడే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర క్రీడా మంత్రి (అనురాగ్ ఠాకూర్) హామీతోనే తొలుత తమ ఆందోళనను ముగించామనీ, అథ్లెట్లందరూ లైంగిక వేధింపుల గురించి చెప్పారని వినేష్ ఫోగట్ తెలిపారు. ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద కూర్చోవడానికి మూడు-నాలుగు నెలల ముందు తాము ఒక అధికారిని కలిశామని చెప్పారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు ఎలా గురవుతున్నారో, మానసికంగా ఎలా హింసించబడుతున్నారో ఆ అధికారికి వివరించామన్నారు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవ డంతో ధర్నాకు దిగామని వివరించారు. చాలాకాలంగా తన అధికారాన్ని, పదవి ని దుర్వినియోగం చేస్తున్న శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడ్డామని అన్నా రు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహా వీర్ ఫోగట్ మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు.
సీల్డ్ కవర్లో బ్రిజ్ భూషణ్‌పై అదనపు సమాచారం
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి అదనపు సమాచారాన్ని సీల్డ్ కవర్లో సమర్పించ డానికి మహిళా రెజ్లర్ల తరపు న్యాయ వాదిని సుప్రీంకోర్టు అనుమతించింది. ఏడుగురు రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. సీల్డ్ కవర్‌ను ఢిల్లీ పోలీ సులకు ఇవ్వాలని తెలిపింది. మహిళా రెజ్లర్ల ఆరోపణలపై దర్యాప్తు చేయడంలో ఢిల్లీ పోలీసులు ఏమీ చేయడం లేదని మహిళా రెజ్లర్ల న్యాయవాది తెలిపారు.
బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలి
హర్యానాలోని బీజేపీ -జేజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రంజిత్ చౌతాలా సైతం బ్రిజ్ భూషణ్ రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మద్దతు తెలిపారు. బ్రిజ్ భూషణ్, ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడు, అల్లుడి బావమరిది రెజ్లింగ్ అసోసి యేషన్లో వివిధ పదవులు నిర్వహిస్తు న్నారని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజరు సింగ్ ట్వీట్లో ప్రశ్నించారు. ఇది కుటుంబ వాదం కాదా? అని ప్రధాని మోడీని ప్రశ్నించారు.
విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండించిన రెజ్లర్లు
విద్యార్థులతో ఢిల్లీ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడాన్ని రెజ్లర్లు ఖండించారు. వేధించిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, ఆయనను పట్టుకోకుండా మహిళా రెజ్లర్లకు మద్దతుగా వస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకుం టున్నారని విమర్శించారు. ఇది ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు.
విద్యార్థులపై పోలీసుల దాడి
ఎస్ఎఫ్ఐ ఖండన
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు మార్చ్ చేపట్టారు. మార్చ్‌కు అనుమతి లేదనే పేరుతో విద్యార్థులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఇందులో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. అదే సమయంలో చాలా మంది బాలికల బట్టలు చిరిగిపోయాయి. ఢిల్లీ పోలీసులు 144వ సెక్షన్ విధించారు. ఎస్ఎఫ్ఐ సెంట్రల్ సెక్రటేరియట్ సభ్యురాలు ఐషీ ఘోష్‌తో సహా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని భౌతికంగా దాడి చేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనీ, దాడి చేశారని ఎస్ఎఫ్ఐ నేత ఐషీఘోష్ విమర్శించారు. పలువురు విద్యార్థులను పోలీసులు చితక బాదారు. ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించిందని, మహిళా రెజ్లర్లను వేధించిన వ్యక్తికి రక్షణ లభిస్తున్నదని విమర్శించారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఐషీ ఘోష్ ప్రశ్నించారు.రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల హింసాత్మక చర్యలను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిం చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిస్వాస్‌లు ప్రకటన విడుదల చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థుల పైనే కాక, రెజ్లర్ల కుటుంబ సభ్యులపైనా పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల శాంతియుత ఆందోళనపై ఢిల్లీ పోలీసుల క్రూరమైన అణిచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు ఇస్తుందని అన్నారు.