Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీలో వ్యక్తులదే రాజ్యం
- అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే:సీనియర్ నేత జగదీశ్ శెట్టార్ వెల్లడి
బెంగళూరు : బీజేపీ ఆధిపత్య ధోరణులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్ ఈ ఎన్నికల్లో తాను చేస్తున్న పోరాటం ఆత్మగౌరవ పోరాటం అని చెప్పారు. లింగాయత్‌లపై ఆధారపడని కేంద్ర నాయకత్వానికి కీలుబొమ్మగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి పగటి కలలు కంటోందని, అది నెరవేరబోదని ఆయన తెలిపారు. ఇక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన స్పందిచారు. బీజేపీలో వ్యక్తులదే రాజ్యమని, ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.
బీజేపీతో సుదీర్ఘకాలం పనిచేసిన మీరు కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు?
- రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేశా. ప్రత్యేకించి ఉత్తర కర్నాటకలో గత 30 ఏండ్లుగా బీజేపీని బలోపేతం చేస్తూ వచ్చాను. వరుసగా ఆరు పర్యాయాలు కనీసం 25 వేలు ఓట్ల మెజార్టీ పైబడే విజయం సాధిస్తూ వచ్చాను. అయితే ఇదంతా పట్టించుకోని బీజేపీ అధిష్టానం చివరి క్షణంలో టిక్కెట్ ఇవ్వడం లేదని చెప్పేసింది. అది కూడా ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఇంతకంటే అవమానం ఉంటుందా? నా ప్రశ్నలకు బీజేపీ అధినేత జెపి నడ్డా సైతం సమాధానాలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. అందుకే ఆత్మగౌరవం కోసం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరా. ఇది ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం.
పార్టీయే ముందు..వ్యక్తులు తర్వాత అని బీజేపీ అంటుంటుంది కదా?
- అదంతా ఒట్టిదే. బీజేపీ లో వ్యక్తులదే రాజ్యం. ఇక్కడే చూడండి పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అయిన బిఎల్ సంతోష్ ఇష్టానుసారం నడుస్తోంది. అతను ఏది చెప్పితే అదే ఫైనల్. పార్టీ అనేది తర్వాత అంశం. వ్యక్తులే ప్రధానం.
ఒకవేళ బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉంటారనే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీ అడ్డు తొలగించుకున్నారంటారా?
- అంతే కదా? అందుకనే టిక్కెట్ రాకుండా చేశారు. సీఎం బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సంతోష్ అందరూ రేసులో ఉన్నారు. బిఎస్ ఎడ్యూరప్ప తర్వాత లింగాయత్‌లలో నేనే సీనియర్ నేత. తప్పకుండా నాకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకనే తప్పించారు. అయితే ముఖ్యమంత్రి పదవి నాకు వద్దు అని, రాతపూర్వకంగా కూడా రాసిస్తానన్నా వారు నమ్మలేదు.
ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో మీ అనుబంధం కొనసాగుతుందా?
- ఆర్ఎస్ఎస్తో నాది సుదీర్ఘకాలం అనుబంధం. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినందున ఆర్ఎస్ఎస్తో కొనసాగలేను. అక్కడితో నా సంబంధాలు తెగిపోయాయి. అయితే ఆర్ఎస్ఎస్ నేతలతో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం మాత్రమే కొనసాగుతుంది.
అయితే లింగాయత్‌లను కాంగ్రెస్ చులకనగా చూస్తోందన్న ఆరోపణ ఉంది కదా?
- ఆ విమర్శతో నేను అంగీకరించను. కాంగ్రెస్ సుమారు 50 మంది లింగాయత్‌లను ఈ ఎన్నికల్లో బరిలో నిలిపింది. కాంగ్రెస్ హాయంలో ఎంబి పాటిల్ వంటి వారికి కీలక పదవులు ఇచ్చారు. వాస్తవానికి లింగాయత్‌లతో ఆధారపడని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ అజెండా లింగాయత్‌లను చులకనగా చూస్తున్నది బీజేపీ యే.
మీరు బీజేపీ వీడటం వల్ల ఈ ఎన్నికల్లో ప్రభావం ఏమిటి?
- బీజేపీని వీడటం వల్ల నా ప్రభావం కనీసం 20-22 స్థానాల్లో ఉంటుంది. అనేక జిల్లాల్లో చాలా మంది లింగాయత్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు కూడా. అయితే నాకు మద్దతు ఇవ్వకుండా చేయాలని బీజేపీ అధిష్టానం నుంచి లింగాయత్ నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. ఐటీ, ఈడీ దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారు.
ఇది మీకు చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలా?
- అదేం కాదు. మరో పదేళ్లు నేను క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతాను.
కాంగ్రెస్‌లో ప్రస్తుతం మీ పొజిషన్ ఏమిటి?
- నేను కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తగా చేరాను. ఏదో పదవి ఆశించి కాదు. కార్యకర్తగానే కొనసాగుతాను. కాంగ్రెస్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంతో పురోగతి ఉంది. కచ్చితంగా కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసముంది.