Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ టోటల్ గ్యాస్ సంస్థకు చట్టబద్ధమైన ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న షా ధంధారియా అండ్ కంపెనీ ఆ బాధ్యతల నుంచి వైదొలిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఈ కంపెనీ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని పలు సంస్థలకు షా ధంధారియా అండ్ కంపెనీ, ధర్మేష్ పారిఖ్ అండ్ కంపెనీలు ఆడిటర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ రూ.84 కోట్లు చెల్లించగా, అదానీ గ్రూప్ రూ.7 కోట్లు చెల్లించింది. ఈ రెండు సంస్థల సామర్ధ్యాన్ని హిండెన్‌బర్గ్ నివేదిక ప్రశ్నించింది. 'షా ధంధారియాకు ప్రస్తుతం వెబ్సైట్ ఏదీ లేదు. ఈ సంస్థకు కేవలం నలుగురు భాగస్వాములు, 11 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ కంపెనీ తన కార్యాలయానికి రూ. 32 వేల నెలసరి అద్దె చెల్లించింది' అని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఈ సంస్థ భాగస్వాములకు పెద్దగా అనుభవం కూడా లేదనీ, దేశంలోని అతి పెద్ద కంపెనీల ఖాతాలను తనిఖీ చేసే సామర్ధ్యం వారికి లేదని నివేదిక ఎత్తిచూపింది. కాగా సరైన ఆడిట్ ఆధారాలు సంపాదించలేకపోవడం వల్ల తాము రాజీనామా చేయలేదని షా ధంధారియా సంస్థ తెలిపింది. తమ రాజీనామాకు ఏ ఇతర కారణాలూ లేవని కూడా చెప్పింది. ఇతర బాధ్యతలు ఉండడం వల్లనే అదానీ గ్రూప్‌కు రాజీనామా చేశామని వివరణ ఇచ్చింది. షా ధంధారియా కంపెనీ స్థానంలో ఆడిటర్‌గా వాల్టర్ చందియాక్ అండ్ కంపెనీని అదానీ గ్రూప్ నియమించింది.