Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణాలను దిగజారుస్తున్న కేంద్రం
- కోజికోడ్ సెమినార్లో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ విమర్శ
కోజికోడ్ : దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం దిగజారుస్తోందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్, కోజికోడ్‌లోని కేలూటన్ సెంటర్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్ సంయుక్తంగా విద్యపై నిర్వహించిన మూడు రోజుల సెమినార్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థి ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదనే విషయంలో ఏకపక్ష జోక్యం చాలా ఎక్కువగా వుందని పట్నాయక్ తెలిపారు. ''ఇటువంటి మార్పులు పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చార్లెస్ డార్విన్ సిద్దాంతం ఎక్కడా కనిపించదు, మొఘల్ సామ్రాజ్యం ఊసే వుండదు, దేశంలో దారిద్య్రం మాటే లేదు. స్వాతంత్య్రోద్యమంలో ప్రభావవంతమైన పాత్ర పోషించిన మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్ గురించి చర్చే లేదు.'' అని ఆయన పేర్కొన్నారు.మరో స్థాయిలో చూసినట్లైతే, విద్యాబోధనతో అస్సలేమాత్రం సంబంధం లేని వ్యక్తులను యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా లేదా ఫ్యాకల్టీ సభ్యులుగా చేస్తున్నారు. ''ఢిల్లీ యూనివర్సిటీలో, ఏండ్ల తరబడి తాత్కాలిక హోదాలో బోధిస్తున్న అనుభవజ్ఞులైన వారి స్థానంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహితులైన వారిని నియమిస్తున్నారు.'' అని ఆయన విమర్శించారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ, గత విద్యా విధానాల ప్రస్తావన లేకుండానే దీన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ''గతంలోని వాటికన్నా మెరుగైన రీతిలో తీసుకువస్తున్నామనే కాకుండా, విద్య పట్ల ప్రస్తుత గుత్తాధిపత్య ధోరణిని ప్రజల ముందు ప్రతిబింబించేలా ఈ విద్యా విధానం వుంది. భారత రాజకీయాల్లో ప్రస్తుత గుత్తాధిపత్యాన్ని కార్పొరేట్-హిందూత్వ కూటమి అనుసరిస్తోంది. నయా ఉదారవాదం, నయా ఫాసిజం మధ్య పొత్తు ద్వారా వ్యక్తమవుతున్న అంతర్జాతీయ పోకడల్లో ఇదొక భాగంగా కూడా వుంది.'' అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో, సమాజంలో ఈ కూటమి స్థానాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే ప్రస్తుత విధానం లక్ష్యంగా వుంది. ''ఇటువంటి కూటమి సమాజంలోని ఏ విమర్శనాత్మక ఆలోచననైనా లేదా సృజనాత్మకతనైనా ధ్వంసం చేయగలదు. సమాజంలో విమర్శనాత్మకంగా ఆలోచించే వారిని అణగదొక్కడం వారిని జాతి వ్యతిరేక శక్తిగా పేర్కొనడం నయా ఉదారవాద, నయా ఫాసిస్ట్ కూటమి ప్రయోజనంగా వుంది. విద్యా కార్యకలాపాల పరిధి నుంచి సాధారణ ప్రజలు మినహాయించబడుతున్నారు. విశ్వవిద్యాలయాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది విశ్వవిద్యాలయ ప్రవేశ వ్యవస్థను ఒక వ్యాపార వస్తువుగా మార్చడానికి దారి తీస్తోందని అన్నారు. ''మీకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష వుంటే, కోచింగ్ తరగతులు వుండాలి, దాని కోసం మీరు డబ్బు చెల్లించాలి, ఇంతా చేస్తే మీ తుది ఫలితాలు మీరు అడ్మిషన్ పొందడానికి సరిపడా వుండవు, నిరుపేద నేపథ్యం కలిగిన ఒక విద్యార్థి వద్ద కోచింగ్ క్లాస్‌లకు వెళ్లడానికి సరిపడా డబ్బు వుండదు'' అని పట్నాయక్ పేర్కొన్నారు. రిజర్వేషన్ రేంజ్ అనేది విద్యా విధానంలో ప్రస్తావించని కారణంగా రిజర్వేషన్ ప్రయోజనాలను తిరస్కరించడం మరో అంశంగా వుందన్నారు.