Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ డివై చంద్రచూడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు ద్రవ్య బిల్లులుగా చట్టాలను ఆమోదించడంతోపాటు కొన్ని రాజ్యాంగపరమైన కేసులను విచారించేందుకు ఏరుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ తెలిపారు. బుధవారం మనీ బిల్లులకు సంబంధించిన విషయాన్ని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించారు. ''మనీబిల్లుల సమస్య ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అంశం'' అని సింఘ్వీ అన్నారు. ''ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. పరిశీలిస్తాను'' అని సిజెఐ బదులిచ్చారు.మనీ బిల్లులు ప్రత్యేకంగా పన్నులు విధించడం, కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బును కేటాయించడం కోసం నిబంధనలను కలిగి ఉన్న బిల్లులు. వాటిని లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. రాజ్యసభ ద్రవ్య బిల్లులకు సవరణలను మాత్రమే సూచించగలదు. రాజ్యసభ ద్రవ్య బిల్లులపై చేసిన సిఫార్సులను లోక్సభ ఆమోదించాల్సిన అవసరం లేదు. ఆ సిఫారసులను తిరస్కరించవచ్చు. 2019 నవంబర్లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, ఆర్థిక చట్టం-2017ను మనీ బిల్లుగా ఆమోదించడాన్ని విస్తృత ధర్మాసనం నిర్ణయించాలని ఆదేశించింది. ట్రిబ్యునళ్ల పనితీరును నియంత్రించే పథకాలను పునరుద్ధరించిన ఆర్థిక చట్టం-2017కు సవాలుతో సహా ట్రిబ్యునళ్ల పనితీరుకు సంబంధించిన పిటిషన్ల విచారణలో ధర్మాసనం ఈ ఆదేశాన్ని ఇచ్చింది. ఆ సందర్భంలో లోక్సభలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి రాజ్యసభ చేసిన సూచనలన్నీ పక్కనపెడుతూ చేసిన చట్టం 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.మనీ బిల్లు రూపంలో ఆర్థిక చట్టాన్ని ఆమోదించడం పూర్తిగా సరికాదని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పిటిషనర్ల పేర్కొన్నారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఆ నిర్ణయం కూడా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనందే కాబట్టి, సుప్రీంకోర్టు 2019లో ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సూచించాలని నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న సీజేఐ చంద్రచూడ్ ఆధార్ కేసులో విభేదించారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించలేరని అన్నారు.