Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి పడ నుంది. రాజకీయ విస్తరణలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంలో నూతన భవనాన్ని బీఆర్ఎస్ గురువారం ప్రారంభించనుంది. శాస్త్రోధిక కార్యాక్రమాల అనంతర పార్టీ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించను న్నారు. ఆడంబరాలకు దూరంగా జరగనున్న ఈ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌తో పాటు కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు మాత్రమే పాల్గొననున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొందరు కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం ఉదయం 05:30 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. పూర్ణాహుతి కార్యక్రమం ముగిశాక కెసిఆర్ మధ్యాహ్నం 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసిన తర్వాత పార్టీ జెండా ఎగురవేసి.. నూతన భవనంలోకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ కమిటీలో ఒకటి, రెండు నియామకాల ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేసే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా భవన నిర్మాణ పనులను గురువారం మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌లు పరిశీలించారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎక్కువ హడావిడిలేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు నేతలు చెబుతున్నారు.
కాగా, 2021 సెప్టెంబర్ 2న వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలంలో ఆఫీసు భవనానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. అయితే కేవలం 20 నెలల్లో పార్టీ కార్యాలయ పనులు పూర్తయ్యాయి.
వాతావరణం కారణంగా సీఎం ప్రయాణంలో మార్పు...!
ఢిల్లీలో భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ పర్యటన రద్దు అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి బుధవారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ, ఢిల్లీలో వాతావరణ సహకరించకపోవడంతో గురువారం ఉదయానికి ఆయన ప్రయాణాన్ని మార్చుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.