Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాసిక్యూషన్ సాక్ష్యాలలో వైరుధ్యాలు
- నరోడా గామ్ కేసులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్య
అహ్మదాబాద్ : నరోడా గామ్ హింసపై సిట్ జరిపిన దర్యాప్తుపై ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలలో వైరుధ్యాలు ఉన్నాయనీ, అవి విశ్వసించదగినవిగా లేవని తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది. హింసకు కుట్ర జరిగిందంటూ సంఘటన జరిగిన ఆరున్నర సంవత్సరాల తర్వాత సాక్షులు తెలిపారనీ, అయితే వారి వాదనలను సిట్ పరిగణనలోకి తీసుకోలేదని ప్రత్యేక కోర్టు ప్రస్తావించింది. 2008కి ముందు గుజరాత్ పోలీసు అధికారుల ఎదుట వారు ఇచ్చిన సాక్ష్యాలకు, ఆ తర్వాత సిట్ ఎదుట ఇచ్చిన సాక్ష్యాలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయని తెలిపింది.
'వాస్తవానికి గుర్తు తెలియని దుండగుల గుంపు మైనారిటీల ఆస్తులను ధ్వంసం చేసి, వారిని హతమార్చింది. నేరస్తులు కుట్రకు పాల్పడి, చట్టవిరుద్ధంగా గుమిగూడి, విధ్వంసానికి తెగబడ్డారన్న వాస్తవాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది' అని కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితుల తరఫు సాక్షులను కూడా దర్యాప్తు అధికారులు విచారించి ఉండాల్సిందనీ, కానీ అది జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తన తరఫున సాక్ష్యం చెప్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షాను అనుమతించాల్సిందిగా కొడ్నానీ అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. నరోడా గామ్‌లో హింస జరిగిన సమయంలో కొడ్నానీ అక్కడ లేరని అమిత్ షా కోర్టులో సాక్ష్యం చెప్పారు. అయితే సాక్షులు చెప్పిన విషయాలలో వైరుధ్యాలు ఉన్నాయని, అవి విశ్వసనీయమైనవి కావని కోర్టు వ్యాఖ్యానించింది.
నరోడా గామ్ హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 67 మందినీ ప్రత్యేక కోర్టు గత నెల 20న నిర్దోషులుగా విడిచిపెట్టింది. వీరిలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాయా కొడ్నానీ, వీహెచ్‌పీ మాజీ నాయకుడు జయదీప్ పటేల్, బజరంగ్దళ్ నేత బాబూ బజరంగీ కూడా ఉన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా నరోడా గామ్ ప్రాంతంలో 2002 ఫిబ్రవరి 28న జరిగిన హింసాకాండలో 11 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే.