Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో మోసం :చింతూరు ప్రచారభేరి సభలో బృందాకరత్
రాజమహేంద్రవరం: బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న వినాశకర ఆర్థిక, సామాజిక విధానాలపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ పిలుపునిచ్చారు. 'బిజెపిని సాగనంపుదాం-దేశాన్ని రక్షించుకుందాం' అనే నినాదంతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గత నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభమైన ప్రచారభేరి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్లో వాడవాడలా సాగింది. ఈ క్రమంలో చింతూరు మండల కేంద్రంలో గురువారం మహా ప్రదర్శన, పాత ప్రభుత్వాస్పత్రి ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. చింతూరు శబరి ఒడ్డు సంత పాకల నుంచి లారీ యూనియన్ కార్యాలయం, చింతూరు సెంటర్ మీదుగా పాత ప్రభుత్వాస్పత్రి వరకూ భారీ ర్యాలీ కొనసాగింది. వేలాది మంది సిపిఎం, సిపిఐ కార్యకర్తలు ఎర్ర జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శన ముందు భాగాన గిరిజనుల సంప్రదాయ నృత్యమైన కొమ్ము డోలు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చింతూరు సెంటర్లోని అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్, మల్లు దొర, గంటం దొరల విగ్రహాలకు బృందాకరత్ పూలమాల వేసి నివాళ్లర్పిం చారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథి బృందాకరత్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు ప్రయోజనాన్ని కలిగించేలా విధానాలను రూపొంది స్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో మోసపూరితంగా వ్యవహరించిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి, నివాసం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పని చేయలేదన్నారు. గ్రామసభలు కూడా నిర్వహించకుండా నిర్ణయాలు చేశారని తెలిపారు. అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు పన్నుల్లో రూ.30 వేల కోట్ల రాయితీలు కల్పించి, సామాన్యులను విస్మరించారన్నారు. బడ్జెట్లో ఆహార భద్రత, ఉపాధి చట్టం నిధుల్లో కోత విధించారని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఉపాధి కూలీల పని ప్రాంతాలకు వెళ్లి పరిశీలించామని, అక్కడ వారు చేస్తున్న కష్టానికీ, తీసుకుంటున్న ఆహారానికీ చాలా వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కారం మెతుకులు మాత్రమే తీసుకుంటున్నవారు ఎక్కువమంది ఉన్నారన్నారు. ఇలా ఎలా తింటున్నా రని అడిగితే, నిత్యావసరాల ధరలు కొనలేని దుస్థితి లో ఉన్నామని వారు చెప్పారని తెలిపారు. మోడీ మన్ కీ బాత్ వంద సార్లు పెట్టారని, జన్ కీ బాత్ ఒక్కసారీ పెట్టలేదని అన్నారు. చట్టాలను నాశనం చేసే బుల్డోజర్లా మోడీ వ్యవహరిస్తున్నారని, ఆ బుల్డోజర్కు వైసిపి ప్రభుత్వం చోదకునిగా సారథ్యం వహిస్తోందని విమర్శించారు. ముంపు మండలాలు పెట్టుబడిదారుల దోపిడీకి నిదర్శనంగా ఉన్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే వారికి ఎర్రజెండా అండగా నిలుస్తుందని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ మతం పేరుతో మారణహోమం సృష్టించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగిస్తున్నారని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రంలో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీ ఉన్నాయన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు ముంపు మండలాల్లో 300 గ్రామాల్లో సుమారు మూడు లక్షల మంది గత ఏడాది వరదల్లో ముంపునకు గురయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన పది లక్షల రూపాయల పరిహారం, పునరావాసం తదితర హామీలు అధికారంలోకి వచ్చాక జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపిని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్.పిచ్చయ్య. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, కుంజా సీతారామయ్య, లోతా రామారావు, మట్ల వాణిశ్రీ, పూనెం సత్యనారాయణ, పల్లపు వెంకట్, విఆర్.పురం ఎంపిపి కారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.