Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్ గవర్నర్ ఆదేశాలు
- హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేయిదాటడంతో నిర్ణయం
- సంబంధిత ఉన్నతాధికారులకు ఉత్తర్వులు
- అల్లర్లలో చిక్కుకున్నవారి కోసం సహాయ కేంద్రాలు
ఇంఫాల్ : రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లతో చెలరేగిన హింస ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ను అట్టుడికిం చింది. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటాయి. దీంతో కనిపిస్తే కాల్చేయాలంటూ మణిపూర్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హౌం శాఖ ఉత్తర్వుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేయి జారడంతో గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, సబ్ -డివిజనల్ మేజిస్ట్రేట్లు, అందరు కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లు, ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లకు మణిపూర్ గవర్నర్ అధికారాన్ని కల్పించారు. రాష్ట్రంలో హింస కారణంగా అల్లర్లలో చిక్కుకుపోయిన వారి కోసం రాష్ట్ర హౌం శాఖ కదిలింది. ఈ మేరకు వారి కోసం రిలీఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 9000 మందిని రక్షించి వారికి వసతి కల్పించినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు.
అల్లర్లు ఎందుకు?
షెడ్యూల్ తెగ హౌదా కోసం గిరిజనేతర మెయితీ వర్గం డిమాండ్‌ను ఇక్కడి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు మెయితీ వర్గం డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ అఖిల గిరిజన విద్యార్థి సంఘం మణిపూర్ (ఏటీఎస్యూఎం) బుధవారం తుర్బుంగా ప్రాంతంలో గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. అయితే, అంతకముందు మెయితీ వర్గం ఎస్టీ హౌదా కోసం చేసిన డిమాండ్‌కు మణిపూర్ లోయ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభిం చింది. ఇది గిరిజన ప్రాంత ప్రజల్లో ఆందోళనను కలిగించింది. ఇది కాస్తా ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీ వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు. మణిపూర్ లోయలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మెయితీ వర్గానికి అనుమతి లేదు.
8 జిల్లాల్లో కర్ఫ్యూ.. రంగంలోకి బలగాలు.. ఇంటర్నెట్ నిలిపివేత
అయితే ఈ రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. ఇందుకు చురాచాంద్‌పూర్ కేంద్ర బిందువుగా మారింది. కొద్ది రోజుల క్రితం సీఎం బీరెన్‌సింగ్ పాల్గొనాల్సిన సభ వేదికను కొందరు ఈ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తాజా ఆదేశాలకు ముందు నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిప్పంటిం చారు. ఈ ఘర్షణలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆర్మీ, రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది. రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది.
రాష్ట్రం మండిపోతున్నది.. సహాయం చేయండి : ప్రధానిని కోరిన మేరీకోమ్
రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ సైతం ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మండి పోతున్నదనీ, సహా యం చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ను ఆమె అభ్యర్థించారు. రాష్ట్రంలోని పరిస్థితిపై అమిత్ షా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తో మాట్లాడారు.