Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకాశ్మీర్ : భారత సైన్యానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఎఎల్‌హెచ్ ధ్రువ్ ఛాపర్ గురువారం జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో కుప్పకూలింది. మార్వా అటవీ ప్రాంతంలోని ఓ నదిలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైలెట్, కో పైలెట్‌కు గాయాలవ్వగా... వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించినట్లు అంతకముందు అధికారులు వెల్లడించారు. దీంతో మూడో వ్యక్తి గురించి స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఇది రెండోసారి...
ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఎఎల్‌హెచ్ ధ్రువ్.. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపేశారు. గత సోమవారం నుంచే వీటి సేవలను పునరుద్ధరించారు. ఈ క్రమంలో తాజా ఘటన చోటుచేసుకుంది. మార్చి 16న అరుణాచల్‌ప్రదేశ్‌లో సైన్యానికి చెందిన ఏవియేషన్ చీతా హెలికాప్టర్ రోజువారీ శిక్షణలో ఉండగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.