Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి తన రేడియో సర్వీసు సేవలు 'ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్)'ను 'ఆకాశవాణి' గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులను ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ వసుధా గుప్తా బుధవారం జారీ చేశారు. ఈ చట్టబద్దమైన మార్పును తక్షణమే అమల్లోకి తీసుకునిరావాలని ఉత్తర్వుల్లో కోరారు. 'ఇది ప్రభుత్వం తీసుకున్న పాత నిర్ణయం. ఇప్పటి వరకూ అమలు చేయలేదు. మేం ఇప్పుడు దీనిని అమలు చేస్తున్నాం' అని ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ద్వివేది తెలిపారు. ప్రసార భారతి చట్టం 1997 నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆకాశవాణి అంటే కార్యాలయాలు, స్టేషన్లు, ఇతర ఏర్పాట్లు మాత్రమే. రేడియో సేవలకు 'ఆల్ ఇండియా రేడియో' అనే పేరే ఉండేది. ఈ సేవలను ఇప్పుడు ఆకాశవాణిగా మార్చారు. ప్రస్తుతం ఆకాశవాణికి దేశవ్యాప్తంగా 470 ప్రసార కేంద్రాలు ఉన్నాయి. 23 భాషల్లో, 179 మాండలికాల్లో ప్రసారాలు చేస్తోంది. దేశ విస్తీర్ణంలో 92 శాతాన్ని, మొత్తం జనాభాలో 99.19 శాతాన్ని కవర్ చేస్తోంది.