Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 19.73 ఎకరాల్లో ఏపీకి 12.09 ఎకరాలు
- తెలంగాణకు 7.64 ఎకరాలు
- సమావేశ మినిట్స్ విడుదల కేంద్రం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధానిలోని ఏఫఈ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఏప్రిల్ 26న కేంద్ర హౌంశాఖ సంయుక్త కార్యదర్శి(ఇంటర్ స్టేట్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ప్రతిపాదించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం దేశరాజధానిలోని ఆంధ్రభవన్లోని ఆస్తుల విభజన సమస్య చర్చించి, పరిష్కరించడానికి ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన 2023 ఏప్రిల్ 26న సమావేశం నిర్వహించామని మినిట్స్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు , తెలంగాణ రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలపగా... కేంద్రం ఆప్షన్ ఈ తో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణయోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని హౌంశాఖ పేర్కొంది.
సమావేశం ప్రారంభ సమయంలో రెండు రాష్ట్రాల అభిప్రాయాలు చెప్పాలని సంయుక్త కార్యదర్శి కోరారని తెలిపింది. ఏపీ భవన్ విభజనకు మూడు ఆప్షన్లు (ఏ,బీ, సీ) ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపిందని హౌంశాఖ పేర్కొంది. తమకు రెండు ఆప్షన్లు (సీ, డీ) ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారని పేర్కొంది. ఆప్షన్ డీలో భాగంగా పటౌడ్ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారం ఈ ప్రతిపాదన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదనపు భూమి కోసం ఆంధ్రప్రదేశ్‌కు 2/3 విలువతో కూడిన ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. ఆప్షన్ సీని తెలంగాణ గతంలోనే వ్యక్తపరించిందని తెలిపింది. అయితే, తెలంగాణ తాజా ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని హౌంశాఖ పేర్కొంది.
తదనంతరం కేంద్ర సంయుక్త కార్యదర్శి ఆప్షన్ ఈ తో ముందుకొచ్చారని పేర్కొంది. ఇది ఆప్షన్ డికి వ్యతిరేకమని పేర్కొంది. పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు అంటూ కేంద్రం ఆప్షన్ ఈ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆచరణీయంగా ఉందని తెలిపారని పేర్కొంది. ఆప్షన్ సీ, డీ, ఈలను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వం తమతమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలిపి సమస్య పరిష్కారానికి సహకరించాలని కేంద్రం కోరింది. సమావేశంలో సంయుక్త కార్యదర్శులు సంజీవ్ కుమార్ జిందాల్, జి.పార్ధసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ తెలంగాణ తరఫు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఏ: తెలంగాణకు శబరి బ్లాకు సహా పటౌడీ హౌస్‌లో సగభాగం ..
ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం
- ఆప్షన్ బీ: ఏపీకి పటౌడీ హౌస్మొత్తం, శబరి బ్లాకు.... తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్
- తెలంగాణ ఆప్షన్ సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్
- తెలంగాణ ఆప్షన్ డీ: తెలంగాణకు శబరి, గోదావరి నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు ... ఏపీకి పటౌడీ హౌస్
- కేంద్రం ప్రతిపాదన ఆప్షన్ ఈ : ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ సహా 12.09 ఎకరాలు..
తెలంగాణకు పటౌడి హౌస్ 7.64 ఎకరాలు.