Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత కేసీఆర్
- భద్రత పేరుతో తెలంగాణ పోలీసుల ఓవరాక్షన్
- మీడియాకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గురువారం నాడిక్కడ వసంత్ విహార్‌లో నిరాడంబరంగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసిన కేసీఆర్ పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అనంతరం పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడిగా తనకు కేటాయించిన సీట్లో కూర్చొని నేతలతో కాసేపు ముచ్చటించారు.పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా కేసీఆర్, గురువారం ఉదయం 11:40 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కేసీఆర్‌కు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మధ్యాహ్నం 12:54 నిమిషాలకు వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా, ప్రారంభోత్సవ శిలాపలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన భవనంలో వేద పండితులు సుదర్శన హౌమం నిర్వహించారు.
ఈ పూజల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కేసీఆర్ నేరుగా తుగ్లక్ రోడ్‌లోని అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు పార్టీ ముఖ్య నేతలతో ముచ్చటించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.
తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం చూపారు. భద్రత పేరుతో హడావుడి చేశారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక పదుల సంఖ్యలో వాహనాలతో ముఖ్యమంత్రి కాన్వారు పార్టీ కార్యాలయానికి చేరుకోగానే...
కాన్వారులోని సీఎం భద్రతా సిబ్బంది, ప్రత్యేక బృందాలు పోలీసులు అత్యుత్సాహం చూపారు. పార్టీ కార్యాలయానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ప్రధాన మార్గాన్ని సైతం మూసివేసారు.
మీడియాకు నో ఎంట్రీ
బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మీడియాకు అనుమతి నిరాకరించారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాన్ని రిపోర్టు చేసేందుకు తెలుగు మీడియా ప్రతినిధులతో సహా జాతీయ మీడియా ప్రతినిధులు ఉదయమే అక్కడకు చేరుకున్నారు.
మీడియాకు అనుమతి లేదని పోలీసులు, మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. దీంతో కార్యక్రమం ముగిసిన వరకు మీడియా ప్రతినిధులు రోడ్డుపైనే నిరీక్షించారు.