Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ 20 సమ్మిట్ నేపథ్యంలో రాష్ట్రాలకు ఎన్సీపీసీఆర్ లేఖ
- దేశంలో వారి వాస్తవ పరిస్థితి తెలియకూడదనే ఈ చర్య : సామాజిక కార్యకర్తలు
న్యూఢిల్లీ : జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందే వీధి బాలలను తరలించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సూచించింది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో అన్ని రాష్ట్రాల శిశు సంక్షేమ శాఖలకు లేఖ రాశారు. దేశంలో సెప్టెంబర్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. వీధి బాలలకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రణాళికలను సమర్పించాలని 2021, 2022లో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన ఉదహరించారు. 'రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించిన హాట్స్పాట్ల జాబితాను అందించాలి. మే 1 నుంచి 31 వరకు వీధుల్లో ఉన్న పిల్లల కోసం ప్రతి జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టడానికి క్యాలెండర్‌ను అందించాలి. వీధుల్లో పిల్లలను రక్షించడాన్ని పర్యవేక్షించడానికి కమిషన్ తన అధికారిని నియమిస్తుంది' అని పేర్కొన్నారు. కమిషన్ ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశాలు నిర్వహించి, సూచనలు చేసిందని తెలిపారు. అయితే పురోగతి గురించి ఎలాంటి సమాచారం అందలేదని లేఖలో పేర్కొన్నారు. వీధుల్లో ఎక్కువ సమయం గడిపే వారు, యాచక చిన్నారులు, నిరాశ్రయులైన వారు, అనాథ పిల్లలు, అలాగే పాఠశాలలకు వెళ్లకుండా వీధుల్లో సంచరించే బాలలను తరలించాలని సూచించారు.
యూనిసెఫ్‌తో కలిసి పని చేయొద్దు
మరో లేఖలో ప్రియాంక్ కనూంగో ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)తో కలిసి పనిచేయవద్దని రాష్ట్రాలను కోరారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమ్మతి, ఆమోదంతో దేశంలో పని చేయడానికి, కార్యకలాపాలను చేపట్టడానికి అంతర్జాతీయ ఏజెన్సీని ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు. 2017లో మంత్రిత్వ శాఖతో కమిషన్ సంతకం చేసిన ఐదేండ్ల కంట్రీ ప్రోగ్రామ్ యాక్షన్ ప్లాన్ (సీపీఏపీ)ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది దేశాన్ని సందర్శించనున్న జీ20 ప్రతినిధుల నుంచి భారతదేశ బాలల వాస్తవ పరిస్థితిని దాచడానికి జరుగుతున్న ప్రయత్నమని సామాజిక కార్యకర్త నిర్మల్ గోరానా పేర్కొన్నారు. వీధి బాలల సమస్యపై ప్రభుత్వ ప్రతిస్పందన ఎప్పుడూ ఆశించినంత లేదని, తగినంత పునరావాస యంత్రాంగమూ లేదని తెలిపారు. ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఢిల్లీ యూనివర్సిటీ కోర్టు సభ్యుడు అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ బలహీనమైన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి పాఠశాలలు ఉత్తమమైన ప్రదేశమని అన్నారు. అయితే ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 2011 జనాభా గణన ప్రకారం దేశంలో 4.13 లక్షల మంది యాచకులు, బడుగులు ఉన్నారు. అందులో 61,311 మంది 19 ఏండ్లలోపు పిల్లలు. ఉత్తరప్రదేశ్‌లో 14,599 మంది బాల యాచకులు, వదిలివేయబడిన వారు ఉండగా, తరువాత స్థానంలో రాజస్థాన్ (8,976), బీహార్ (4,485), పశ్చిమ బెంగాల్ (4,323) ఉన్నాయి.