Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల రిబ్బన్లతో రెజ్లర్ల నిరసన
- కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి రెజ్లర్ల సమస్యపై మౌనమెందుకు: ఏఆర్ సింధూ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు నేడు (గురువారం) బ్లాక్ డేని పాటించనున్నా రు. నల్ల రిబ్బన్లను ధరించి ఆందోళన చేయను న్నారు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. సీఐటీయూ తరఫున జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధూ సంఘీభావం తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్ల ఆందోళన 18వ రోజుకు చేరింది. బాక్సర్ నీరజ్ గోయల్ జంతర్ మంతర్‌ను సందర్శించి మద్దతు తెలిపారు. మన రెజ్లర్లకు అండగా నిలవాలని దేశ ప్రజలను అభ్యర్థించారు.
ప్రజలంతా ఉద్యమంలో చేరాలి: సాక్షి మాలిక్
ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు నార్కో టెస్ట్ ద్వారా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) తాత్కాలిక ప్యానెల్లో అన్ని పోటీలు జరగాలని మేం కోరుకుంటున్నామని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ప్రమేయం ఏదైనా ఉంటే వ్యతిరేకిస్తామని అన్నారు. ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనా లని విజ్ఞప్తి చేశారు. ''ఇప్పుడు ఎందుకు గొంతు ఎత్తుతున్నారని అంటున్నారు. ఇప్పుడు మాట్లా డటం సరైనదని అనిపించింది. మేం మాట్లాడు తున్నాం. మీ సోదరి, కూతురు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు ఇలా మాట్లాడి ఉండేవారు కాదా?'' అని సాక్షి మాలిక్ ప్రశ్నించారు. ''మీరు నిజాన్ని దాచవచ్చు, మీరు దానిని అణచివేయ లేరు. రేపు నల్ల బ్యాండ్లు కట్టి నిరసన తెలుపు తున్నాం. యావత్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నాం. అందర్నీ పిలుస్తున్నాం. వచ్చి ఈ ప్రదర్శ నలో చేరండి'' అని అన్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రెజ్లర్ వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ ''రెజ్లింగ్ సమాఖ్యకు విరాళంగా ఇచ్చే నిధులు అథ్లెట్లకు చేరాయో లేదో తనిఖీ చేయాలని రతన్ టాటాను నేను అభ్యర్థిస్తున్నాను'' అని అన్నారు.
ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళ కమిషన్ సమన్లు
ఢిల్లీ పోలీసులకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ బుధవారం సమన్లు జారీ చేసింది. పోక్సో కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయడంలో విఫలమైనందుకు ఢిల్లీ పోలీసు లకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలుసుకున్న తర్వాత జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కి సమన్లు జారీ చేసి, ఈ అంశంపై వివరణ కోరారు. యాక్షన్ తీసుకున్న నివేదికతో మే 12న కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ డీసీపీని కోరింది.
పార్లమెంటరీ కమిటీకి లేఖ
కేంద్ర క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ వివేక్ ఠాకూర్‌కి టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ లేఖ రాశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మెన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. క్రీడా సమాఖ్యలు, ఇతర సంస్థలకు వర్తించే అన్ని చట్టబద్ధమైన చట్టాల అమలు, క్రీడా మంత్రిత్వ శాఖ పాత్రను సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కోరారు.
స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి: ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ కోర్టు నోటీసులు
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసుపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఢిల్లీ కోర్టు కోరింది. నిరసన తెలిపిన రెజ్లర్ల పిటిషన్‌పై న్యాయమూర్తి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ కోర్టు అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ విచా రించారు. మే 12వ తేదీలోగా దీనిపై తదుపరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచా రణను మే 12కు వాయిదా వేశారు.
రెజ్లర్లు ఏప్రిల్ 21న ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెజ్లర్ల తరపున న్యాయవాది ఎస్ఎస్ హుడా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల అలసత్వం కారణంగా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఏప్రిల్ 25న ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు ఆయన సూచించారు. ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఫిర్యాదుల వాంగ్మూ లాలు నమోదు కాలేదని హుడా తెలిపారు. ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన 24 గంటల్లోగా వాంగ్మూలాలను నమోదు చేయాలని పోలీసుల ను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. సింగ్‌పై దాఖలైన రెండు ఎఫ్ఐఆర్ల కాపిని కూడా కోర్టుకు అందజేశారు. ఈ కేసును కోర్టు పర్య వేక్షణలో దర్యాప్తు చేయాలని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం ఫిర్యాదు దారుల వాంగ్మూలాలను నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటి షన్లో కోరారు. ఈ నిబంధన స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి మేజిస్ట్రేట్‌కు అధికారం ఇస్తుంది. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారిం చిన కొన్ని గంటల తరువాత బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెండు ప్రాధమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్లు) దాఖలయ్యాయి.
కేంద్రమంత్రి స్మతి ఇరానీ... మౌనమెందుకు..?: ఏఆర్ సింధూ
జంతర్ మంతర్ వద్ద నిరసన వేదిక వద్దకు చేరుకున్న కార్మిక సంఘాల నేతలు రెజ్లర్లతో సమావేశమై నిరసన కార్యక్రమాలను వివరించారు. న్యాయం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని నేతలు పేర్కొన్నారు. హర్యానాకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులు గురువారం నిరసన ప్రదేశానికి చేరుకోనున్నారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, కుల, మత సమీకరణలు కలగలిపి పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని సిఐటియు జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు విమర్శించారు. న్యాయ వ్యవస్థను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగు తోందని ధ్వజమెత్తారు. ఇది అనుమతించినట్ల యితే, వారు భవిష్యత్తులో అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తారని పేర్కొన్నారు. అన్ని విషయాల పై స్పందించే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెజ్లర్ల సమస్యపై మాత్రం మౌనంగా ఉన్నారని సింధు దుయ్యబట్టారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, ఐఎన్టీయూసీ నేత అశోక్ సింగ్, ఎఐయూటీయూసీ నేత సంతోష్ రాజ్, టీయూసీసీ నేత రాజేందర్, సేవా నాయకురాలు లత తదితరులు ఉన్నారు.