Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌కు రహస్య సమాచారం కేసులో సంఫ్‌ు కార్యకర్త కురుల్కర్ అరెస్ట్
- మోడీ, అమిత్‌షా సమాధానం చెప్పాలి..కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఏజెంట్‌కు రహస్య సమాచారం అందించారనే ఆరోపణలపై అధికార రహస్యాల చట్టం కింద అరెస్టయిన డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ ఎం.కురుల్కర్ ఆర్ఎస్ఎస్ క్రియాశీల కార్యకర్త అయిన కాంగ్రెస్ విమర్శించింది. కురుల్కర్ పోలీస్ కస్టడీని ఈ నెల 15 వరకూ ప్రత్యేక కోర్టు పొడిగించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడారు. కురుల్కర్ అరెస్టు చాలా తీవ్రమైన విషయమని, ఇది ఆర్ఎస్ఎస్ జాతి వ్యతిరేక వైఖరిని బయటపెడుతుందని అన్నారు. 'ప్రదీప్ కురుల్కర్ ఆర్ఎస్ఎస్ క్రియాశీల కార్యకర్త. డీఆర్డీఓ ఆర్ అండ్ డీ (ఇంజనీరింగ్) డైరెక్టర్ అయిన అతను పాకిస్తాన్‌కు రహస్య సమాచారం చేరవేసినందుకు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది. జాతీయవాద సంస్థగా గొప్పలు చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అబద్ధాలను, నిజస్వరూపాన్ని ఇది బట్టబయలు చేస్తుంది' అని ఖేరా అన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి కురుల్కర్ ఆర్ఎస్ఎస్ సంబంధాలపై ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్తో తమ అనుబంధం తరతరాలుగా కొనసాగుతుందని, తన తాత, తండ్రి కూడా ఆ సంస్థ కోసమే పనిచేశారని గత ఏడాది ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కురుల్కర్ వెల్లడించిన విషయాన్ని ఖేరా గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఈ వీడియోను ప్రదర్శించారు. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ మహిళా ఏజెంట్‌కు డిఆర్‌డిఒలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక విధుల్లో ఉన్న కురుల్కర్ వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు గుర్తించి, ఆయనను గత వారం ఎటిఎస్ అరెస్టు చేసింది.