Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 68 మంది న్యాయాధికారులకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి చట్ట వ్యతిరేకం
- నోటీసులు ఇచ్చాక కూడా గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు
- కేసు పెండింగ్‌లో ఉన్నదని తెలిసి కూడా పదోన్నతా..?
- బీజేపీ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్లు జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భారు వర్మ పదోన్నతిని అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. గుజరాత్లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయాధికారులకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ గుజరాత్ హైకోర్టు సిఫారసులు, గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వుల జారీపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భారు వర్మ కూడా ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
హరీశ్ హస్ముఖ్ భారు సహా 68 మంది న్యాయమూర్తులను జిల్లా జడ్జి కేడర్ కు ప్రమోట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్ హైకోర్టు సెలక్షన్ జాబితాను జారీ చేసింది. అయితే, ఈ జాబితాను సవాల్ చేస్తూ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ- కమ్- మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.'' కోర్టు నిర్ణయానికి విభిన్నంగా ఆ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించడం చట్టవిరుద్ధం. ఆ ప్రమోషన్ జాబితా అమలుపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత పదవుల్లోకి వెళ్లిపోవాలి'' అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా మే 15న పదవీ విరమణ చేయనుండగా, ఈ అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త ధర్మాసనానికి కేటాయించనున్నారు.