Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ ఏ ప్రాంతాలు దోహదం చేశాయి
బెంగళూరు : 2023 కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలోని మొత్తం ఐదు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన ఓట్ షేర్‌ను పెంచుకున్నా.. ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా పెరిగింది. మరింత ముఖ్యంగా ముంబయి/కిత్తూర్ కర్ణాటక, మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇక్కడ మొత్తం 62 స్థానాలకు 44 స్థానాలను 44.9 శాతం ఓట్ షేర్‌తో దక్కించుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ 6.2 శాతం, స్థానాలు 24 పెరిగాయి. మరోవైపు ఇక్కడ బిజెపి ఓట్ షేర్ ఈ ఎన్నికల్లో 39 శాతానికి దిగజారింది. 2018 ఎన్నికలతో పోలిస్తే బిజెపి 23 సీట్లను నష్టపోయింది. జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవేది వంటి నాయకులు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలసివచ్చింది.
దక్షిణ కర్ణాటక, మల్నాడ్ రీజన్ (పాత మైసూర్ ప్రాంతంతో కలిసి)లోనూ కాంగ్రెస్ కదం తొక్కింది. ఇక్కడ కాంగ్రెస్ 46 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తంగా 71 సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 25 సీట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ సారి 40.9 శాతం ఓట్ షేర్ సాధించింది. గత ఎన్నికల కంటే ఇది 6.6 శాతం అధికం. ఈ ప్రాంతంలో జెడి(ఎస్)కు ఈ ఎన్నికల్లో 15 స్థానాలు లభించగా, బిజెపి కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది.
కోస్టల్ కర్ణాటకలో బిజెపి ప్రభావం చూపింది. ఇక్కడ మొత్తం 19 స్థానాలకు గాను బిజెపి 12 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ బిజెపి ఓట్ షేర్ 48.6 శాతంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 43.2 శాతం ఓట్ షేర్‌తో 6 స్థానాలను గెలుచుకుంది. ఇక బెంగళూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్ కన్నా బిజెపి ఎక్కువ ప్రభావం చూపింది. బిజెపి 46.1 శాతం ఓట్ షేర్‌తో 15 స్థానాలు సాధించగా, కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్ షేర్‌తో 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ 42.9 శాతం, బిజెపి ఓట్ షేర్ 35.9 శాతం, జెడి(ఎస్) ఓట్ షేర్ 13.3 శాతంగా ఉంది.