Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ వనరుల వినియోగంలో...
- అగ్రస్థానంలో నార్వే : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) నివేదిక
ప్రపంచవ్యాప్తంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకుని దానిని పెట్టుబడిగా ఉపయోగించుకోవడంలో ఇండియా అట్టడుగున (గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్) 103వ ర్యాంకులో నిలిచింది. ఈ విషయంలో మనకన్నా చాలా చిన్న దేశమైన నార్వే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఈ గణాంకాలను ఇక్కడి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది
జెనీవా: మానవ వనరుల నైపుణ్యాలను పెంపొందించుకుని, గ్లోబల్ మార్కెట్లో పోటీ యోగ్యతను పొందటంలో ఒక్కో దేశపు సత్తాను ఫోరమ్ నివేదికలో సూచించింది. గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ఫిన్ల్యాండ్ను వెనక్కి నెట్టివేసి నార్వే ఆ స్థానానికి ఎగబాకింది. బ్రిక్స్ కూటమిలో కూడా రష్యా తొలి స్థానం (16వ ర్యాంకు) సంపాదించుకోగా, చైనా (34), బ్రెజిల్ (77), దక్షిణాఫ్రికా (87) దక్కించుకున్నాయి. ఇండియాకు వాటన్నిటికన్నా వెనకాల మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్ కన్నా వెనకబడిపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మాత్రమే మన వెనకాల నిలిచాయి.
ఇండియా పరిస్థితి ఇలా అధ్వానంగా ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 25-54 ఏండ్ల మధ్య వయస్కుల్లో ప్రాథమిక స్థాయి విద్యావ్యాప్తిలో మన దేశం 110వ స్థానంలో ఉంది. హ్యూమన్ క్యాపిటల్ అంటే నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడం మరో కారణం. అంటే అందుబాటులో ఉన్న కార్మిక శక్తి (35-54 ఏండ్ల మధ్య వారు) ని ఉపయోగించుకోలేకపోవడం అని ఈ సూచికకు అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు, దేశంలోని అత్యధిక సంఖ్యలోని కార్మికులు సాధారణమైన నైపుణ్యం అవసరం లేని ఉపాధిలోనే గడిపేస్తున్నారు. అదే సమయంలో దేశంలో పరిస్థితిలో మార్పు వస్తోందని ఫోరమ్ అభిప్రాయపడింది. భవిష్యత్తు అవసరాలకు కావల్సిన నైపుణ్యాలను పెంపొందించడంలో ఇండియా రైజింగ్ అన్న లక్షిత సూత్రాన్ని అందుకోగలుగుతోందని, ఈ విషయంలో మొత్తం 130 దేశాల పరిస్థితి సమీక్షించగా ఇండియాకు 65వ ర్యాంకు వచ్చింది.
ఇక తొలి పది ర్యాంకులు సాధించిన దేశాలు, వాటి ర్యాంకులు ఇలా ఉన్నాయి. - అమెరికా (4), డెన్మార్క్ (5), జర్మనీ (6), న్యూజిలాండ్ (7) స్వీడెన్ (8), స్లోవేనియా (9), ఆస్ట్రియా (10)