Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వశక్తులకు వ్యతిరేకంగా నిరసనల జ్వాల
- ఎక్కడికక్కడే నిలిచిన రవాణాొ స్కూళ్లు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు మూసివేత
- ఔరంగబాద్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- బంద్ సక్సెస్ : అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
దళితుల ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో.. బీజేపీ పాలిత మహారాష్ట్ర కళ్లారా చూసింది. భీమా కోరేగావ్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వ నీడన పెట్టిన చిచ్చుకు వ్యతిరేకంగా దళితులంతా ఏకమవ్వటంతో నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడింది. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా దళిత యువకులంతా రోడ్డుకెక్కారు. గల్లీ నుంచి మొదలుకుని ముంబయి మహానగరం సైతం నిలిచిపోయింది. ఔరంగాబాద్‌లో ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా శాంతి భద్రతలకోసం భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. బుధవారం తామిచ్చిన బంద్ విజయవంతమైందని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ప్రకటించారు. నిరసనలు ప్రశాంతంగా ముగియటంతో.. ఫడ్నవీస్ సర్కారు ఊపిరిపీల్చుకుంది.
ముంబయి : ఉరుకులు, పరుగులతో రద్దీగా ఉండే మహారాష్ట్ర ఒక్కసారిగా స్తంభించిపోయింది. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దళితులు నిర్వహించిన కార్యక్రమంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకగణం వెనకుండి నడిపిన హింసకు నిరసనగా బిఆర్ అంబేద్కర్ మనవడు, భరిప బహుజన్ మహాసంగ్ నాయకుడు ప్రకాశ్ అంబేద్కర్, పలు దళిత సంఘాలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్, దాదాపు 250 ప్రజా సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. దీంతో ఎటు చూసినా.. ఎప్పుడు.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణమే కనిపించింది. చలికాలం కావటంతో పొగమంచు తెరలు కప్పిఉండగానే.. ఉదయం ఎనిమిది గంటలకే రోడ్డు కెక్కారు. గుంపులు, గుంపులుగా చేరుకున్న దళిత యువకులంతా అగ్రవర్ణాల దాడులకు వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు. మహారాష్ట్ర సర్కారు ముందస్తుగా 144 సెక్షన్ విధించినా దళితాగ్రహం ముందు అవేమీ కనిపించలేదు. ఠానేలో ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద పోలీసు భారీగా రంగంలోకి దిగారు. రైళ్లను ఆపకుండా నడపాలని రైల్వే అధికారులు ఎంతగా ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. రైల్వేట్రాక్‌లపై దళిత యువకులంతా జెండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ రైళ్లను కదలనీయలేదు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ద్వారా రోజూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉపాధిబాట పడతారు. కానీ బంద్‌తో ఒక్క రైలూ బయటకు రాలేదు. అలానే ముంబయితో సహా మహారాష్ట్రలోని మహాదారులన్నీ బోసిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. ప్రభుత్వ ,ప్రయివేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. అప్రమత్తమైన ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు పలుచోట్ల నిరసనకారులను చెదరగొట్టారు. చిత్ర, బుల్లితెర పరిశ్రమ సైతం నిలిచిపోయింది. అన్ని షూటింగ్‌లను నిలిపివేశారు. ముంబయిలో తొమ్మిదిమందిపై కేసులు నమోదుకాగా, దాదాపు 100 మంది నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. నాసిక్‌లో బంద్ సంపూర్ణంగా జరిగింది. నగరంలో వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూతపడ్డాయి. బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. దళితులు బలంగా ఉన్న బీడ్, లాతూర్, షోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఔరంగాబాద్‌లో మంగళవారం పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టిన ఘటనలు చోటుచేసుకోగా.. బుధవారం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. పోలీసులు రెచ్చగొట్టడంతో..పలు ప్రాంతాల్లో ఆగ్రహానికి గురైన నిరసనకారులు బస్సులపై రాళ్లు విసిరారు. దళిత యువకుల వెంట పోలీసులు పహారా కాస్తూ.. పరిస్థితి మరింతగా చేజారకుండా అడ్డుకున్నారు.
హింసకు పాల్పడింది ఆర్ఎస్ఎస్, బీజేపీ మద్దతుదారులే : జిగేశ్
పూణె జిల్లాలో దళితులపై దాడులకు పాల్పడింది ఆర్ఎస్ఎస్, బీజేపీ మద్దతుదారులేనని గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మెవానీ ఆరోపించారు. 'బ్రాహ్మ నిజం అత్యంత తీవ్రరూపంలో ఉన్న ఆధునిక పేష్వాలు ఈ సంస్థలు. మా పూర్వీకులు 200 ఏండ్ల క్రితం పేష్వాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ తరం దళితులు ఇప్పుడు ఆధునిక పేష్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దళిత వాదానికి భయపడే అగ్రవర్ణాలవారు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు' అని జిగేశ్ మెవానీ ఆరోపించారు.
జిగేశ్, ఉమర్ ఖాలిద్లపై ఫిర్యాదులు
దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మెవానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ తమకు ఫిర్యాదులందాయని పోలీసులు తెలిపారు. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబ రు 31న పూణెలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. అక్షరు బిఖాద్, ఆనంద్ డోండ్ అనే అనే వ్యక్తులు వీరిపై పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు తెలుస్తోంది. మెవానీ, ఉమర్‌లపై కేసు నమోదుచేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. హింసకు పాల్పడిన వారిని వదిలేసి.. దళిత నేతలు, అక్కడకు వచ్చిన నాయకులపై కేసులు పెట్టడాన్ని వివిధ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.
ఢిల్లీని తాకిన మహా సెగలు
మహారాష్ట్ర భవన్ వద్ద దళితుల ఆందోళన
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో దళితుల నిరసన సెగ దేశ రాజధానిని తాకింది. దళిత్ సోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం), బహుజన్ కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది ఢిల్లీలో కస్తూరిభాగాంధీ మార్గ్‌లోని మహారాష్ట్ర భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. పూణెలో దళితుల ప్రదర్శనపై దాడికి తెగబడిన కాషాయ కూటమికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు, పూణె జిల్లా అధికారులకు మితవాద శక్తులకు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. దళితులపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందేనని విమర్శించారు. మహారాష్ట్ర భవన్ వద్ద జరిగిన సభలో దళిత్ సోషణ్ ముక్తి మంచ్ నేత రాంపాల్, బహుజన్ కమ్యూనిస్టు పార్టీ నేత నియోగి ప్రసంగించారు. హింసాత్మక చర్యలకు కారకులైన కాషాయ మూకలను అరెస్టు చేయాలని, ఎస్సీ, ఎస్టీ చట్టం 2015కింద నిందితులపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన అమాయక దళితులను వెంటనే విడుదల చేయాలని కోరారు.