Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలాలను మరువని బలమైన గొంతుకతో, కవిత్వంతో ఏం చేయాలో తెలిసిన లోచూపుతో, తన ప్రాంతపు భాషాభివ్యక్తిని కలగలపి కాలానుగుణంగా కవిత్వాన్ని రాసిన కవి పల్లిపట్టు నాగరాజు. దేశ రాజకీయాల పట్ల ఎరుక కలవాడు.సామాజికత, సమకాలీనత ఈ కవి కవిత్వబలం.
పల్లిపట్టు నాగరాజు చిత్తూరు జిల్లా రాజగోపాలపురం గ్రామ నివాసి.ఇది ఈ కవికి మొదటి కవితా సంపుటి కానీ తన కవిత్వం ద్వారా పలువురి దష్టిని ఆకర్షించాడు. మనిషిని మనిషే అణచివేసిన సంఘటనలు, దుఃఖం, పేదల పక్షాన నిలబడుతూ చైతన్యాన్ని నింపడం, బహుజనుల బాధలను ఏకరువు పెట్టడం, ఆత్మీయతను వత్తిని కలిపి పద్యంగా మల్చడం, రైతు పాదాలకు కవిత్వలేపనాన్ని పూయడం, అస్తవ్యస్తమైన దేశ తీరుతెన్నులను ఎండగట్టడం, ఆకలి గురించిన వేదనతో పాటు దళిత జీవిత అస్తిత్వఘోష ఈ కవితా సంపుటిలో కనిపిస్తుంది.
ఎక్కువపాళ్ళు రాయలసీమ భాషాసంబంధిత వ్యక్తీకరణ కవితల్లో వాడాడు. 'కుశాల' అనే పదం చాలా చోట్ల కనబడుతుంది. ఒకతూరి, పుస్తకానికి పెట్టిన యాలైపూడ్సింది, ముదిగారం, దొంగనా బట్టి లాంటి పదాలు అక్కడి ప్రాంతపు నుడికారాన్ని పట్టిస్తాయి.
వెంటాడే వాక్యాల్లోకి...
మా ఇళ్ళు అద్దాల మేడలు కాకపోవచ్చు
మా ఇళ్ళు బలిసినబల్బులై వెలగకపోవచ్చు
మా ఇళ్ళనిండా
మా మూలుగులున్నాయి
మా ఆకటి నిప్పులున్నాయి
మా ఏడ్పులున్నాయి
మా వేదనలున్నాయి (పేజీ 40, ఇళ్ళు)
పేదరికపు ధైన్యస్థితిని చూపించే కవిత ఇది. ఉన్నపలంగా స్వలాభాల కోసం ఊర్లకు ఊళ్ళను, ఇళ్ళకు ఇళ్ళను ఖాళీ చేయించినప్పుడు పడే యాతనను తెలియజేసే కవితా పాదాలివి. కవి ఇళ్ళు అనే సాధారణ శీర్షికతో కవితను నడిపిన ఇళ్ళుతో మనిషికుండే సంబంధాలను, పేదవాడి బతుకు చిత్రాలను ఈ వాక్యాల్లోకి పట్టుకొచ్చాడు.
రుక్కత్త గురించి చెప్పడమంటే
మురికిలేని మనసు గురించి చెప్పటమే
రుక్కత్తగురించి రాయడమంటే
ఇంటిని భుజాలపై మోసి మోసి
ఒంటరిగా మిగిలిపోయిన
దుఃఖకావ్యాన్ని సదవడమే (పేజీ 48; రుక్కత్త)
ప్రేమకు, మానవ సంబంధాలకు ప్రతీక ఈ కవిత. చాపలమ్మి జీవనం కొనసాగించే అమ్మ జీవితం కవిగమనింపులో కవిత్వమైంది. మలినం లేని మనుషులను పరిచయం చేసే వాక్యాలివి. కవి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నట్టుగా రాస్తూనే ఆమె జీవితం తాలూకా బాధలను ముందుపెట్టాడు. ఇందులో ''దొంగనా బట్ట'' అనే పద ప్రయోగం సాన్నిహిత్యాన్ని ప్రేమను చూపేదిగా కవి ప్రవేశపెట్టాడు. మొత్తంగా జీవితాన్ని కళ్ళముందు పర్సిన కవిత.
జంతువుగురించి మాట్లాడేముందు
మనిషిని గురించి మాట్లాడాలి
మాట్లాడే ప్రతి మాటా
మాయ మాటలు గాకుండా
మాటలు చర్చ జరగాలి! (చర్చ, పేజీ 99)
ఈ కవితలో కవి మనుషుల మధ్య ఉండే తారతమ్యాలను గురించి చర్చ పెట్టుకోవాలంటాడు. అగ్రమైనా, అల్పమైనా ఒకే గుండెకాయతో మాట్లాడాలంటాడు. సమసమాజ స్థాపన గురించి ఆలోచించకుండా జంతువును గురించిన వద అనవసరమంటూ మనుషుల తాలూకా వ్యధపైన చర్చ చేయాలంటాడు. మనుషుల మనుషులుగా చూడబడని చోటుల్లో జంతువుకు ఎందుకింత ప్రాధాన్యత అంటూ లోపలి ఆవేదననంతా ఈ వాక్యాల ద్వారా వ్యక్తపరుస్తాడు.
నేను పీల్చే గాలే
అందరూ పీల్చేది
నేనున్న నేలే
అందరూ ఉండేది
నా ఇల్లెందుకు
ఊరవతల? (పేజీ115, నల్లని రెక్కలు)
ఇది కవి అస్తిత్వ ఘోష. తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. పీల్చేగాలిలో మార్పులేదు, తినే తిండిలో మార్పులేదు. కులమంటూ ఎందుకిలా దూరం పెట్టారంటూ వ్యవస్థకో ప్రశ్నను విసిరాడు. కవి కోరుకున్నట్టుగా ఇంకా పరిస్థితులు మారాలి. ఈ పంక్తులు చూడగానే పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రాసిన శతకంలోని ''కూడు లేక జీవకోటి లేదు. కూడు తినెడి కాడ కులభేదమెందుకో'' అన్న పద్యపాదాలు గుర్తుకొచ్చాయి. కవిది అర్థవంతమైన ఆవేదన.
ఇలా రాజకీయ కోణాన్ని ,దళితవాద అస్తిత్వకోణాన్ని, బహుజనుల వత్తి నేపథ్యాలను తడుముతూ కవిత్వం రాశాడు. కవిత్వం ద్వారా తన ఆవేదనను వెళ్ళగక్కుతూనే 'యాలైపూడ్సింది' అంటూ హెచ్చరిక జారి చేశాడు.
- తండ హరీష్
8978439551