Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చెర్ల మండలానికి చెందిన నసురుల్లాబాద్ గ్రామం ఎంతో గొప్ప చరిత్ర గల ప్రాంతం. ఇక్కడ అత్యంత పురాతన శైవాలయం, నవాబుల సమాధులు మూడు, ఇక్కడి మసీదు ప్రవేశ ద్వారం బయట రెండు శాసనాలు, ఇతర కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి శివాలయం అత్యంత పురాతనమైనది. ఇది కాకతీయ యుగానికి చెందినదిగా భావించబడుతోంది. తెలంగాణ రాష్ట్రం నవాబుల హస్తగతం అయిన తరువాత శిథిలమైన వాటిల్లో ఒకటి నసురుల్లాబాద్ శైవాలయం. ప్రస్తుతం దాదాపుగా పుర్తిగా చెట్ల మధ్యలో ఉంది ఈ దేవాలయం. ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి నేను నా జడ్చెర్ల మిత్రుడు మాదినేని సందీప్, మరికొంత మంది గ్రామస్తులతో కలిసి అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి లోపలికి ప్రవేశించాము. లోపల అద్భుతమయిన శివలింగం, ఎదురుగా ఉన్న మరో ప్రవేశ ద్వారం వద్ద కింద పడి ఉన్నాయి. కుతుబ్షాహి వంశస్థులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాలంలో జడ్చెర్ల ప్రాంతాన్ని నుసూరుల్ ఉల్ ముల్క్ పరిపాలించేవాడు. అతని పేరుతోనే నసురుల్లాబాద్ గ్రామం ఏర్పడింది. ఈ సమాధులు నుసూరుల్ ఉల్ ముల్క్ కుటుంబానికి చెందినవిగా ఇక్కడి స్థానికులు భావిస్తున్నారు. నవాబుల రాచరిక వైభవానికి నిదర్శనం అయిన హైదరాబాదు నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి అద్భుతమైన నిర్మాణశైలి ఇక్కడ కూడా చూడవచ్చు. ఎంతో అద్భుతమయిన నిర్మాణశైలి గల ఈ ఆలయం, సమాధులను అభివద్ధి చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివద్ధి చెంది పాలమూరు ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది.
- యడ్లపల్లి అమర్నాథ్
9398245804
చరిత్ర పరిశోధకుడు