Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకసాన ఇంద్ర ధనుస్సులై
గుండె తోటలో రంగు రంగుల
సీతాకోక చిలుకలుగా ఎగిరే
మన నవ్వుల పువ్వుల
చిట్టి చిన్నారులను గట్టిగా
పొదిమి పట్టుకోండి !
కనిపించని రాకాసి అల ఇంకా
ఎగిరెగిరి కమ్ముకువస్తూనే ఉంది
ఎదురైన వాళ్ళ నెల్లా
కనికరం లేకుండా కబలిస్తోంది !
సముద్రాలు, దేశాలు
కొండలు, కోనలు
మిద్దెలు, పూరి గుడిసెలు
తేడా లేమీ లేకుండా
ప్రాణాలను హరిస్తూ
బ్రతుకులను చిద్రం చేస్తూ
ప్రపంచాన్ని పీనుగుల దిబ్బలుగా
మర్చేస్తున్న ఆ మహమ్మారి నుండి
మన 'అంకురాలను'
రక్షించు కుందాం!
మోగని బడి గంటలకు
మూగబోయిన పసిడి కూనలు
ఇంటి గోడల మధ్య బంధీలై
కంప్యూటర్ తెరలవేపు
బిక్క చూపులతో అతుక్కొని
కునారిల్లిపోతూ అసహనంతో
అల్లాడిపోతూ మిగిలిపోతున్నారు
చెంగు చెంగున ఎగురుతూ
భుజాన చదువులమ్మను మోస్తూ
వీధులన్నీ రంగుల పువ్వులై
విరియటంచూడకఎన్నాళ్ళయిందో?
మరిచిన మధుర బాల్యాన్నివారిలో
తిరిగి చిగిర్చి విరిసేలా చేయాలి !
చావుకు వెరవక
అస్త్ర శస్త్రాలతో వైద్యులు,
శాస్త్రజ్ఞులు, రక్షక సిబ్బంది
ఆ పెనుసైతానుతో పోరుసల్పుతూ
మనకోసం కోట గోడలై నిలుస్తున్న
ఈ తరుణంలో మనమంతా
జాగరూకులై రోగ నిరోధక టీకా
సంజీవినితో రక్షణ పొందాలి!
మరుగున దాగి ఎదగాల్సిన
రేపటి శిశు తరాన్ని
విషపు గాలుల నుండి
వైషమ్యాలు, కార్పణ్యాలు,
అమానుషపు చూపులనుండి
కనురెప్పలై కాపాడుకుంటూ
కడుపులో దాచుకుందాం రండి!
ముడుచుకుపోతున్నచిన్నిఎదలను
పొదిమిప్రేమతోహత్తుకుందాంరండి !
ధవళ వస్త్రధారి కోటు జేబు మీద
గుబాళించే ఎర్ర గులాబీ పువ్వులా
చిన్నారులను మెరిసేలా చేద్దాం !
( నవంబర్ 14 బాలలదినోత్సవం )
- డా. కె. దివాకరాచారి
9391018972