Authorization
Sun March 09, 2025 01:05:23 pm
పగటి కన్నా
రాత్రి అంటే నాకు భలే ఇష్టం
నేను కష్టపడేది
మరి రాత్రి పూటే
రాయడం నేర్చుకున్న నేను
బతుకును దాయడం నేర్చుకోలేకపోయా
కొందరందుకే,
నేనేదో నేరం చేసినట్టు
వీడింతేనా అని చూసే చూపులు
భవిష్యత్ ని కొరికేస్తున్నాయి
చిల్లులు పడ్డ కలల్ని
ఏరుకుని పోగేసుకుంటూ
కళ్ళకిందుగా లాగేసుకుని
వాటికో రూపాన్నిచే ప్రయత్నంలో
అప్పుడప్పుడు
శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతున్నాను
ఏడుపులను కడుపులో దాచుకుని
నవ్వులు వెదజల్లుతేనే
నలుగురిలో నిలబడగలుగుతున్న క్షణం
ఋతువులు మారినట్లే
మనుషులు మారుతున్నప్పుడు
దుఃఖ ఋతువును
గుండెలకు హత్తుకునేదెలా?
- నామాల రవీంద్రసూరి, 9848321079