Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటుకలపై ఇటుకలు తయారు
సేత్తిమి...
మాపై ఇసుమంత ఇట్టం
లేకపోయె !
ఆకాసమెత్తు సౌదాలపై సౌధాలు
కడితిమి ...
మాకు కూసంత సోటు
ఇయ్యకపోతిరి !
రాదార్లపై రాదార్లు ఏత్తిమి ...
మాపై రవ్వంత పేమ
సూపకపోతిరి !
ఆనకట్టలపై ఆనకట్టలు
నిర్మిత్తిమి ...
మమ్మల్ని ఆపదలో ఆదుకోపోతిరి !
బరువులపై బరువులు ఎత్తితిమి ...
మా బతుకులకు బరోసా
ఇయ్యకపోతిరి !
రాళ్ళను రతనాలుగా సేసితిమి ...
మమ్మల్ని రాళ్ళ కంటే హీనంగా
సూత్తిరి !
మొక్కలను మనసెట్టి నాటితిమి ...
మాపై మానవత్వం మరిసితిరి !
కానీ... ఒక్క మాట సెప్త
ఇంటారా సారూ ...
అబివుద్ది కోసం ఈ దేసమంతా
అడుగులేత్తాం ... అవసరమైతే
ఈ దేసం కోసం మా పానాలైనా
ఇత్తాం ... సారూ ... ఆ ..!!!
- బోనగిరి. పాండు రంగ