Authorization
Thu April 17, 2025 08:33:17 am
గడపలు పట్టనంత స్వార్ధంతో
గుమ్మాలు బావురుమంటున్నాయి.
హృదయాల వైశాల్యం తోరణాలకు కట్టబడిఉంటుంది.
కొనితెచ్చుకున్న మనోవైకల్యం
పరిసరాలను చుట్టిముట్టి
మమతలని మాలిన్యాల రజనులో అద్ది
దగ్గరలో దూరాలను పొదరింట్లో పాతుతుంది
అడుగుల్లో అనుమానం కొలవబడుతూ
మనసు తేలిక చేసుకున్నామనుకొని
చేతులకు మసిపూసుకునే మనుషులే,.. అంతా.
మనం.., అంటూ అరవకూడదు.
జ్ఞాపకాల అల్మారాలో ఏ అర చూసినా ఏముందీ?
తుప్పు వాసన తప్ప..
ఛాతీ ఉప్పొంగుతూ ఎవరు కాస్త
భావోద్వేగాన్ని తూలినా
నిజమిదేననుకుంటూ నమ్మెయ్యకు.
ప్రతి ఒక నట్టింటి నమ్మకం, నడిబజారు
అమ్మకంకంటే ఎక్కువేనని విస్మరించకు.
పాత్రల స్వభావాలు అంచనావేస్తూనో లేక
నిన్ను నువ్వు పూర్తిగా విస్మరిస్తూనో తప్ప
అర్ధతెలివితో మాత్రం నడవకు.
నిజమేబీ మూరు?డు కూడా..
అతి సౌఖ్యంతో, సొంత కాంతితో.. మెరిసిపోతూ
భ్రమని నిజమనుకునే బ్రతికేస్తూపోతాడు.
- అనూరాధ