Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్టంత బిడ్డ
చేదురు బావిల పడ్డట్టు
పంటలన్నీ నీళ్లపాలు
గ్రేహెండ్స్ దాడిలా
వాన తుపాకీ గుండ్లు
కాల్జేతులు కట్టేసి
గొంతుమీద కత్తిలా
ఒరుపులేనివాన
తేరుకోనియ్యని ముసురు
వానంటే
అమ్మ తలంటినట్లుండాలిగాని
తాటిచెట్టు లొట్టి
వొంపినట్లుండాలి కానీ
దానపెడ్తున్న రైతును
కొమ్ములతో పొడిసినట్లుంది
దారాల్లా తెగిపోయిన నడకలు
దీనంగా కుంటలు చెరువులు
కాగితపు పొట్లాల్లా
కొట్టుపోయిన నివాసాలు
పాత మిద్దెల గోస
ఇప్పడిప్పడే
ఊపిరిపోసుకుంటున్న చదువులకు
ఒక్కసారిగా వారం కర్ప్యూ
ఎంతపెద్ద సముద్రమైనా
వానను
దాచుకునెంత తాహతెక్కడిది
నీళ్లవసరమే గానీ
కక్కి సచ్చెటంత వరదలనేంచేస్తం
ప్రళయాలను
ఊహించినా జలఖడ్గాల దాటిని నిలువరించే
అర్జునులెవ్వరు లేరు
అంతా ఉత్తర ప్రగల్బాల
వాన అవసరానికీ
గుండెనివ్వాలి
మొలకల సాళ్లల్లో
పాలధారలై నిల్వాలి
దరువుకు పాటై కదిలియ్యాలి
ప్రకృతికీ
హరితగీతమై సాగాలి
-వనపట్ల సుబ్బయ్య