Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడు బరిలో లేడు
అయినా...
వాడితోనే ఆట మొదలైంది
ఎవడు కూత పెడుతున్నాడో
ఎవడు పట్టు బడుతున్నాడో
అంతా గందరగోళమే
పొంచి పొంచి
పంజా విసురుతూ
పరుగుకాళ్ళకు సంకెళ్ళేస్తూ...
గీత కివతలి వైపే మూసేస్తున్నారు
కూత కంఠాన్ని ఆపేస్తున్నారు
పంపేవాడొకడు... వచ్చేవాడొకడు
వొక్క పాయింటన్నా తెస్తాడనీ
'కోటి' ఆశల సూటు 'కేసు' లెన్నో
ఒకరి ఆట ఇంకెవ్వరో ఆడేస్తున్నారు
మరెవడో అవుటై పోతున్నాడు
బలాల బలగాల కలగాపులగాలకు
ఎంపైర్లూ దోషులవుతున్నారు
ప్రత్యక్ష దృశ్యాలన్నీ
పరదా చాటుకు వెళుతున్నాయి
ఆట ముగియకముందే
గెలుపు మీసం మెలేస్తున్నాడొకడు
ఇప్పుడు ఆటంటే...!
ఆనందాల వినోదం కాదు
గెలుపు దృశ్యమంటే
ఆట ముగింపు అంతకన్నా కాదు
శకుని పాచికలాట
రాజ్యాలను కూల్చే కుతంత్రపు పాట
ప్రతీ రంగంలోనూ
శత్రువుంటాడు... మిత్రుడూ ఉంటాడు
పరోక్షంగా ఓ యుద్ధం దాగుంటుంది
ఓ విజయమూ దాగుంటుంది
అయితే... ఇప్పుడు యుద్ధమంటే...!
శత్రువుతో పోరాటం కాదు
మిత్రుడి వెన్నుపోటును గుర్తించటమే
-డా.కటుకోఝ్వల రమేష్
సెల్:9949083327