Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆజాదీకా అమృతోత్సవ్' పేరిట
ఊరేగే భజనపరత్వంలో...
'గులామీ' కొనసాగింపుగా
అణచివేత సాగుతున్న
బూటక స్వాతంత్య్రంలో
సామాన్యుని జీవనాన్ని చూశారా?
చప్పట్లు తప్పెటల ఆర్భాటాలతో
మహమ్మారిని అంతం చేశామనే
అజ్ఞాన నాయకత్వ ఏలుబడిలో
లేని స్వాతంత్య్రాన్ని ఉన్నదని
చూపేందుకే ఇంటింటిపై
జెండాల ఊరేగింపులా ?
సచ్చే దిన్ కె ఇంతెజార్ ఔర్ కబ్ తక్?
బురే దిన్ కబ్ ఖతం హోంగే ?
అచ్చేదిన్ కబ్ ఆయేంగే ?
'ఘర్ ఘర్ తిరాంగా' కిన్కో బతానాహై?
ప్రతి మనిషిలో రగిలే సందేహాలు !
ముప్పాతికేళ్ళ (అ)స్వతంత్య్ర దేశంలో
మనిషి బ్రతుకు అడుగంటుతూ
మనుగడయే ప్రశ్నార్థకమై పోతోంది
నాడు ఒక్కటిగా కలిసి పోరాడిన
జాతిని స్వార్థ రాజకీయం
నేడు కుల చిచ్చురేపి
మత మారణకాండతో మసి చేస్తుంటే
మానవత్వం బేలగా రోదిస్తోంది !
అడవులను కొండలను కొల్లగొడుతూ
ఆదివాసుల పోడు ఎగుసపు
బ్రతుకులను ఆగం చేస్తూ...
జై కిసాన్ అంటూ ఎలుగెత్తే నేతలు
రైతు బ్రతుకులను రోడ్డున పడేస్తూ
జవానులకు జైకొట్టాల్సిన చోట వారిని
అగ్నిపథ్ జ్వాలలకు ఆహుతి చేస్తూ...
రాజ్యం పెంచిపోషించే దోపిడీ వర్గం
దేశ సంపదను దోచుకుంటూ
ప్రపంచ కుబేరులతో పోటీపడుతుంటే
పేదరికపు చీకటిలో
అణచివేత సంకెళ్ళతో
అధిక ధరల గుదిబండలతో
ప్రజల బ్రతుకొక సవాలైన తరుణాన
ప్రతి ఇంటిలో ప్రశ్నించే గొంతుకలు
తిరగబడే ఎత్తిన పిడికిళ్లు
అసలైన స్వాతంత్య్రం కోసం
సమభావం సహజీవనం
సమన్యాయం స్వేచ్ఛా గానం
వెల్లివిరిసే సుందర దేశంకోసం
కలిసి కదం తొక్కుతూ
మరో పోరాటానికి ఉద్యమించాలి !
పరాయి దోపిడీని దుర్మార్గ పాలనను
అంతమొందించగ ఉవ్వెత్తున
జాతి మొత్తం ఒక్కటై
పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రపు సగర్వ
మువ్వన్నెల పతాకానికి జయహో !
పోరాటమే ఊపిరిగా
స్వాతంత్ర పోరులో అసువులు బాసిన
యోధులకు, దేశభక్తులకు జేజేలు !
ఈ దేశాన్ని తమ ప్రజల్ని ప్రేమిస్తూ
సాగుతున్న ప్రజా పోరాటాలలో
అసువులు బాసిన అమరులను
కన్న మన నేల తల్లికి వందనాలు !
జయహో భారతజన జయకేతనం!
(75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా)
- డా. కె. దివాకరా చారి,
9391018972