Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమంటే సగం వాక్యమే
రాలడానికే ఈ రాక
ఊహాజనిత భ్రమల్లో
బతుకును తీపిగా వాంఛిస్తున్నాం
మత్యునిదుర ముందు
మన చీమలబార్లు
ఉల్లాసంగా తిరుగుతుంటాయి
తను కళ్ళు తెరిస్తే
కుప్పిగంతులు దూళి రేణువుగా
కొట్టుకపోవాల్సిందే
ఈ మోహం దాహం మజిలీలలో
జోలె ఎంతకూ నిండదు
పిడికెడు కబలం పై
మమకారం పెంచుకోవాలేకానీ
పుత్తడిపై ఆశ కాదు
అక్కడికీ బైరాగులు
చెబుతూనే ఉన్నారు
కట్టెకు అలంకరణలు ఉట్టివే అని
అశాశ్వత కలలు
వడలిన పత్రాలు
దీర్ఘ కాలం మనలేవు
జీర్ణమయ్యే జన్మలు
అద్దంలో కనిపించవు
చూపు శబ్దం పరిధి దాటి
తాత్విక మౌనంతో గ్రహించినపుడు
రాకపోకల ఆంతర్యాలు
మార్మికమని తెలుసుకుంటావు
చితిలో చిరునామ
చెరుపుకున్న తరువాత
నీ సంతకం పిడికెడు బూడిద .
- తెలుగు వెంకటేష్,
9985325362