Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇన్నేళ్ల స్వతంత్రంలో
మఱ్ఱి వృక్షం లాంటి నా దేశం
చిగురుటాకుల్లా వణుకుతు
చిన్ని కొవ్వొత్తి వెలుగులో
కోటి ఆశల్ని వెతుక్కుంటుంది!
తూటాలతో తూర్పు కెరటాల్ని
ఆపే రాజకీయ కను రెప్పల్లోని
కాలుష్యాన్ని కాగడతో
వెతకలేక మూలన నలుగుతోంది !!
దురదృష్టం అంగట్లో
అందాల మెక్కి కూచుంది!
అదృష్టం ఉన్న వాడి జేబులో పచ్చని నోటైంది
హే భగవాన్ !
నీవున్నావో లేదో తెలియదు నాకు
మఠాధిపతులకు సైతం
తప్పని కటకటాల జీవితం
పుణ్యం పాపం నీకేమి తెలుసో ...
పూజలు సేవలు నీకేమి ఒరుగునో
తప్పు చేయని వాడికి
విధిస్తావు తప్పని కారాగారం
మనస్సు లేని వాడిని కరుణిస్తావు
దేశాన్ని దోచుకు తినమని
నల్లకుబేరులు నీకేమిచ్చారని
ఉబ్బిబ్బి తబ్బిపోయి
కడుపున పుట్టిన బిడ్డల్లా
వాళ్ళనెందుకు కౌగిలించుకుంటావు !
గాలి వెలుతురు వారిదేనా
చెట్టు చేమ వాళ్ళవేనా !!
దున్నుకుందామంటే
తొలకరికి
జానెడు జాగ ఎక్కడిది ?
అందుకే అడుగుతున్నా
ఈ జన్మకీ వరమివ్వు !
నాకేమి నోట్ల కోట్లు కావాలని కాదు..
స్వర్ణ కిరీటం కాదు...
దేశాన్ని మింగుతున్న
దోపిడీ దారుల కబందహస్తాల నుండి
ఈ నేల తల్లిని కాపాడు...
మెతుకునిచ్చే
రైతన్న ఘోష విను !!
దున్నేవాడికి కాకున్న
పండించే పైరు కోసమన్న
భూమాత ఆర్తనాదం విను !!
స్వతంత్ర పోరాట త్యాగాలను
మరో తరానికి స్ఫూర్తి గొల్పి
పచ్చని పంట పొలాలతో
కళ కళ లాడిన పల్లె మోములో
వెన్నెల కురిపించు
- కొండా రవీందర్, 9848408612