Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా ఎడమ కంట్లోకి ఒక పక్షి
కుడి కంట్లోకి మరో పక్షి
నన్నడగకుండానే దూరి పోయాయి
అవి చెప్పే కథలు వినబోతున్నానని
ఆనందమేసింది
అవి స్పశించిన స్వేఛ్ఛా
తీరాల గూర్చి
కుటిలమెరుగని నదులు పాడే
లయల గురించి
పచ్చని చీరలు నేస్తున్న వనాలూ
మేఘాలకు ఆతిథ్యమిస్తూ ఉన్న
గుట్టల విషయమై
కబుర్లు ముక్కున కరుచుకొచ్చాయని
ఆశల దోసిల్లు పరిచాను
ఎన్నెన్ని కిచకిచలు పోశాయో
పలుకు పలుకులో గాయపరిచిన
రాళ్ళ చప్పుల్లే
అడుగడుగునా గూళ్ళు చెదిర్చిన
తుఫానుల హోరే
దోచబడిన గింజలకు
పొట్టు చెపుతూన్న సాక్ష్యాలే
నా గుండె కల్లోల
సాగరమే అయ్యింది
అలల మీద పిడిగుద్దులు
కురిపిస్తూనే ఉన్నాను
నా అశ్రు ధారలతో సముద్రాన్ని
ప్రక్షాళనం చేస్తూనే ఉన్నాను
********
సింహం కాళ్ళ నడుమ నిద్రిస్తూన్న
పిల్లి కనులు తెరిచి ఆవులించింది
రెండు కాళ్ళు ముందుకీ
రెండు కాళ్ళు వెనక్కి చాచి
ఒళ్ళు విరుచుకుంది
ఒకే ఒక్క గంతులో
ఒక పక్షిని నోట కరుచుకుని
నడిచి పోయింది
రేగిన ఈకలతో పాటుగా
మరో పక్షి బుర్రున
ఎగిరిపోయింది
గాలి ఈకలని ఊడ్చుకు పోతోంది
పిల్లి మూతి నాకుకుంటూనే
నా కనులేదుటే కూచుంది
- పర్కపెల్లి యాదగిరి, 9299909516