Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏది భాష ఏది యాస
ఏది జాతి ఘోష
ఏది నేల శ్వాస
ఏది భావ ధ్యాస
అంబలి, దప్పడం, తొక్కు, సల్ల, ఉప్పిండి,
బుడ్డలు బుక్కిన తల్లి భాస
ఎక్క, చిమ్ని, కందీల ఎలుతురులెంట
కంచె తుడిపేసిన భాస
నరనారాయణుల నోట సరస్పతమ్మ
అచ్చరమై పలికిన భాస
పుట్టిన గడ్డ మీన దిద్దిన ఏంసక్కని భాస..
పోతన్న, సోమన్న పలికిన పదాల గర్మి భాస
మన తెలగాణ భాస
యాసభాస అని ఎక్రిచ్చినోళ్ళు
నోళ్ళార పలవరిస్తున్న భాస
ఇంగిలీసు మించిన మస్తు ఇనసొంపు భాస
మనదైన మనసైన అల్కగుండె భాస...
లిలిలిలిలి
పొద్దుగాల పొద్దుగాల మా కాళోజీ తూరుపు శిరాన
అచ్చరాభ్యాసమై పూచి తట్టిలేపిండు
చురచుర చరిచి, మాన్ బెట్టి తెలగాణ రసం తాగమన్నడు
పుట్కనేర్సిన తెలుగు యాదుందాని నిలదీసిండు?
పచ్చని పచ్చికల రయ్యత్ గొంతుల బుట్టిన
మేలి భాస ఎరికేనా అన్నడు
సమజౌతందా అని తట్టి జెప్పిండు,
కొత్త పొద్దొకటి ముఖాన రాసిండు
నియ్యత్ గ ఇగురం సెప్పినా యినుండ్రని
అందాల అచ్చరాల ఒల్లె కాయిసుగ గట్టిన మన అవ్వ భాస
పతంగిలెక్క మొగులెత్తున ఎగిసిన సొగసు నిండిన భాస
యాదెట్ల మరిసినవని గుస్సాగ జూసిండు
రుద్రమ్మ పొగరొలె బుసలుకొట్టిన భాస
రామప్ప గుడివోలె జవజవలాడిన భాస
జమీరా?న్ లను తన్ని తరిమేసిన భాస
సలమల భగ భగమన్కుంట
గలాటాలకి సొరం సించుకున్న భాస
వొయ్య సేతబట్టి పల్లె పలుకై కులికిన భాస
ఎర్కినా బిడ్డ ? అని మాయమైండు
ఆ సామి
పలుకుల్లో ఏదొ మాయ నింపిండు
జల్దిగ లేవాల, ముసుగుల్ల తోసేసి ఎల్పలికి రావాలె
అవ్వకోక బట్టుకుని ఉరికురికి పోవాలె
గుండెగుండెని ఊరిపాట జేసి మస్తుగ రాగాలు తీయాలే
పొద్దుమీకకముంగలె భాస ముచ్చట్లన్ని పిడికింట్ల బట్టాలె!
మా భాస బిశాదిదని, మా భాస పతారని
దర్వాజ బద్దలు గొట్టి వోల్మత్తం
దునియుయాల దండోర ఎయ్యాల
మూస్కబోయిన కల్లల్ల సీసం పొరలు కరగదియ్యాల!!
- జయశ్రీ మువ్వా