Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమ్మీద తొలిరేకునై
నేను విచ్చుకుంటున్నప్పుడే
నాలో రెక్కలు విప్పుకుంది
నేనెవర్ననే ప్రశ్న!
రివ్వున వీచే గాలికి కొట్టుకుపోయే
కాగితంపువ్వునా?
తలెత్తి అంతరిక్షం గూట్లోకి చూసే
దేవదారు వృక్షాన్నా?
కొండల్ని తొలుచుకుంటూ
నదులన్నీ వెతికేది నన్నేనా?
రంగుల కళ్ళజోడు పెట్టుకున్న కాలాలూ
వలయాల అంచుల మీద నడిచే రుతువులూ
అసలు నాకేమవుతాయి?
చెట్టూ చేమా పురుగూ పిట్టల్ని కన్నాక
ఏ సమతూకం కోసం
నేల మళ్ళీ నీళ్ళోసుకుంది?
నన్నిక్కడ నేలలో విత్తిన మొట్టమొదటి ఉల్క
నా ఈ విధ్వంస వర్తమానాన్ని
ఊహించి ఉంటుందా?
ఏ పురాతన రక్తసంబంధం వున్నదని
శిఖరాలూ సముద్రాలూ
నన్నింత గారాబం చేస్తున్నాయి?
పదే పదే ఎందుకు నన్ను క్షమిస్తున్నాయి?
రోదసి లోయల్లోంచి
నా ఒంటరి పాటల్ని ఎవరైనా వింటున్నారా?
వింటూ నవ్వుకుంటున్నారా?
ఈ చదరంగంబల్ల మీద
నేను విజేతనా? కేవలం పావు నేనా?
నా చేతిలో ఓడిపోవడానికే
ఈ విశ్వం ఉందా?
- సాంబమూర్తి లండ