Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడేమో..
'అస్తిత్వ పోరాటం' పేరు చెప్పి
ధూంధాంగ
ప్రజల్ని పరకాయం చేయించి
ప్రత్యేక ద్రోహుల్ని
అమాత్యులుగ అందలమెక్కిచ్చినవ్ !
ఉన్నపళంగ ఉద్వేగాల్ని రెచ్చగొట్టి
జీవిత ఆకాంక్షల్ని..
ఆకాశమంత ఎత్తుకు ఎగదోసి
ఎన్నో చితులకు ఆరనినిప్పు వెట్టినవ్ !
ఇప్పుడేమో..
పార్టీని 'పాన్ ఇండియా' అంటున్నవ్ !
సేతెవ్వనిది? సాతెవ్వనిది ?
ఇంక నయ్యం రెండు దేశాలంటలేవ్ !!
జలాశయాల్లో నిండామునిగి
నాశనమైనా సస్యశ్యామలమైతమని
భూములకు, భూములు
ఇండ్లకు ఇండ్లు..
త్యాగం చేసిన మట్టిమనుషులకు..
ఎతల్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు సేసి
పరిహారమడిగితే..
నడిరోడ్డు మీద ఇనుప సంకెళ్ళేసి
ఒర్రంగ ఇజ్జతి మానం తీసినవ్ !
(నీళ్ళు..1)
నిధులన్నింటిని
దేశోన్నత పథకాలుగ విభాగించి
'మిషన్లు', 'కమీషన్లు'..
అతి సం'క్షేమం'గ భ్రమించి
వరుసగ అందలమెక్కుతున్నవ్ !
(నిధులు..2)
నీ పాలనలో 'ఉద్యోగ ప్రకటన'
నిరంతర దృశ్యవార్తా స్రవంతి!
నిరుద్యోగుల పాలిట
ఎన్నటికీ ఆరని దీపపు వత్తి !!
(నియామాకాలు..3)
ఎవ్వనికి, ఎక్కడ
ఒరిగింది, జరిగిందేం లేదు.
ఎక్కడేసిన గొంగడి గక్కన్నే వున్నది !
నీ ఒక్క 'ముఖ్య' పదోన్నతి తప్ప !!
ప్రధాన పాలకా!
చేసే పనికి, వచ్చే ఫలితానికి
ఒక చారిత్రక పరిణామముంటది.
ఎంత 'కంపు' ఐనా
ఎంతకాలం 'ఇంపు' ఐతది ?
నో రూల్ ! బట్ ఇట్స్ వెరీ క్రుయల్ !!
మాట్లాడే హక్కును హరించినవ్ !
ధర్నాచౌక్ కర్కశంగ ఎత్తేసినవ్ !!
నిరసనంటే నిప్పులగుండమైతవ్ !
ధిక్కారానికి అగ్గిమీద గుగ్గిలమైతవ్ !!
తీరం దాటినంక గిట్ల
తెప్పలకు తెప్పలు తగులవెట్టెటోళ్ళకు
ఎప్పుడో ఒకప్పుడు
ఉద్వాసన తీవ్రత తప్పనిసరి !
సొంతిల్లునే పూర్తిగ గెల్వలేనోళ్ళు
బయటోళ్ళను ఎట్ల ఓడిత్తరు ?!
గిదంత ఉత్త 'నాన్ పాన్ ఇండియా' !!
- అశోక్ అవారి
9000576581