Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నేళ్ళ నుంచి
అదే నువ్వు
తెరలు తెరలుగా
గాలిలో గిరికీలు కొడుతూ
చెవులకు
చక్కిలిగిలి పెడుతూ నీ నవ్వు
మాటల మంత్రం వేస్తూ
మైమరపిస్తూ
తీరొక్క పరిమళాలను
పరిచయం చేస్తూ
పెదవుల చివర చిరునవ్వులు
తోరణాలుగా వేళ్ళాడదీసి
చురుకుగా
చుట్టూ చేరిన వారిని
ఆకట్టుకుంటూ
అనుభవాలను పంచుతూ
చాకచక్యంగా
జీవితపు పుటలలో
మునుపెన్నడూ స్పశించని
వేర్వేరు కోణాలను చూపిస్తూ
పూలతోటలను బహూకరిస్తూ
మిణుగురులను
దోసిట్లో పోస్తూ
నువ్వు మాత్రం
బరువైన సముద్రాలను
జేబులో వేసుకుని
రికామీగా తిరిగేస్తూ
అవునూ
నువ్వు ఎంతో
అర్ధమైనట్టే ఉంటావు
కానీ ఉన్నట్టుండి
అపరిచిత ముఖమై
ఆకాశంలా నక్షత్రంలా
నిజంలా నీడలా
ఎప్పటికప్పుడు
సరికొత్త పుస్తకంలోని
చదవని పేజీలా
ఇంద్రధనుస్సు అంచులకు అద్దిన
ఏడు రంగులను మించిన
మరొక వింత వర్ణంలా
అంతెందుకు
అదే నువ్వు
నిత్యనూతనమై
ప్రవహించే వెన్నెలనదిలా
వెండి వెలుతురు చిమ్మే అద్భుతదీపంలా
- పద్మావతి రాంభక్త
9966307777