Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపమొకటి వెలిగించాలి
తిమిరాన్ని తరిమేసేందుకు.. ..
దీపమంటే చమురు పోసి
వత్తివేసి వెలిగించడమే కాదుకదా..
బతుకుబాటలో అడుగడుగునా
దారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి..
ప్రయత్న దీపమొకటి వెలిగించాలి
విధి రాతను మార్చేందుకు..
మమతల దీపమొకటి వెలిగించాలి
మతాల మత్తును వదిలించేందుకు.
ప్రేమదీపమొకటి వెలిగించాలి
కులపు మెట్లు కూలగొట్టేందుకు..
కరుణ దీపమొకటి వెలిగించాలి
సాటిమనిషి కన్నీరు తుడిచేందుకు..
జ్ఞానదీపమొకటి వెలిగించాలి
అజ్ఞానాంధకారాన్ని వెడలగొట్టేందుకు .
ఆశా దీపమొకటి వెలిగించాలి
ఆకాశపు అంచులు అందుకోవడానికి..
గెలుపు దీపమొకటి వెలిగించాలి
విజయకేతనాన్ని ఎగరేసేందుకు..
ఆత్మ దీపమొకటి వెలిగించాలి
అంతరంగాన్ని శోధించేందుకు..
అఖండదీపమొకటి వెలిగించాలి
గుండె గుడిలోకి చీకట్లు చొరబడకుండా..
మానవత్వపు దీపాలు వెలిగించాలి
మనిషి మనిషికీ పంచేందుకు..
వెలుగుతున్న దీపమే కదా
ఇతరదీపాలను వెలిగించేది..
- రోహిణి వంజారి, 9000594530