Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు నీ తలపు
తలుపు తెరుచుకుని
ఊహాల్ని గాఢంగా పీల్చుకుని
కళ్ళు గట్టిగా మూసుకుని
కలను తేర్చుకుని
పెదవితోటలో మాట కోసం
నుదుట నడిబొడ్డులో
కనుబొమ్మల చాటుగా
కళ్ళు గుసగుసలు విని ఎరుపెక్కి,
చిరునడకలతో ఇష్టం
ఒంటరి ఆలోచనలో జొరబడి
అందంగా గుండెల్లో
నక్కినక్కి చూస్తూ,
గుబులైనప్పుడల్లా కవితలతో
మనసున తడిపి
ఆశతో కళ్ళను సాగుచేసి
కోరికల గట్టు ఆవల
కలను గుట్టుగా నాటి,
నిద్రను తరిమే రూపాన్ని
కొసరి వడ్డించే అందాన్ని
అరచేతుల్లో గోరింటాకులా
పదే పదే చూసుకుంటూ
నాలుకపై పదాలు ఎర్రగా పండేలా
ఊహాలను పెదాలకద్ది
ముద్దాడిన చోట నులివెచ్చని
ముద్రల కలవరింతలను
తేనె మాటల ఊటలో ముంచి
బొట్టు బొట్టును అక్షరాల్లో జారవిడచి
మధురదృశ్యాలతో మనసు ఆకలితీర్చి
మలుపుతిప్పే సౌందర్యార్థలను
నిజరూపాలతో పాయలుగా విడదీసి
దూసుకెళ్లే లోతుప్రయాణంలో
కుదుపులకు అదుపుతప్పి
అదనుకొద్ది హద్దు చెరిగి
ఆంక్షలు కరిగి విశాలమైన హృదయంపై
లేతగాలిలో ప్రేమ పల్టీలకు
మధురాలూరిన అధరం చుట్టూ
తహతహలాడే ఆనందాన్ని
ఆక్రమించుకునే బంధం
ఎన్ని జన్మల పుణ్యానికి వరమో అని
ప్రియురాలి పాదాన్ని
ప్రియుడి పెదవి రహస్యార్చన
రసమయ సమయంలో
కాలం వెనక్కి నడచినట్లు
మంచం కౌగిలిలో వాలే చూపులకు
మౌనంగా కాపలా కాస్తూ
తనువు తీరాలపై గెంతులేసే
పూలమాలను చెక్కిళ్ళకు పిలిచి
ఎద నడుమలో వాసనను పట్టంకట్టి
వాంఛకు వ్రాసిన వీలునామను
అక్షరాలా చదివితే
మేను ఊగే జాము జాములో
ఆగి ఆగి అలసట తీర్చే
మెత్తని దాహాన్ని దోసిల్లకొద్ది
దప్పిక తీర్చడం ఉబికే బిర్రుదనాలకు
తడిమి చలిని వేడితో చల్లపరచడమనే
వేడుక విరహంలో భాగమే.
చిరు చెమటలను చిగురించి
పూసే కానుకలతో సుమధురాల వేడుక
తరగని తృప్తి మబ్బులుపట్టి
కరగి కురిసి వరదైన ప్రేమ
మది గది తలుపుల్ని తోసుకుని
ఇరువురి మధ్య గట్లను కలిపి
ఒకరినొకరు ఊహల కట్లను తెంచి
ఒకరినొకరిని పంచుకుని
ఇన్నేళ్లు ఒకరిని ఒకరికి
దాచి దోబూచులాడిన కాలం
కంటికి చిక్కి కల ధాటికి
కరిగి ఇద్దరిలో కలిసిపోయింది.
కాలికో చేతికో ఇప్పటికి గుచ్చుకునే
పాత మాటకు పదును తగ్గినా
చురుకైన కాలంలో
యడబాటును ప్రయోగించి
చలాయించిన పాలనలో
ఎన్ని వేసవి రాత్రుల్లో
అలిగిన మల్లెలు
వేకువ తోక పట్టుకుని తుర్రుమంటే
విరిగిన కల పట్టపగలు
ఎక్కడెక్కడికో తిరిగి
పడక పంచకొచ్చేనాటికి
కొత్త కట్టులో ఆ రోజు
మెలికలు తిరిగే కోరికను మెలేసి
ఉమ్మడి అద్దంలా ఒకే అందం ఒడిలో
ఇద్దరూ ఒక్కటై ఒకరిని ఒకరు
ఒక్కరై గెలుచుకున్నారు.
- శ్రీ సాహితి, 9704437247