Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులు లోతుగా నడిచి
మాట ఒత్తిడికి అర్థం చిత్తడయ్యక
మనసులు దూరం గడచి
చిక్కునడకతో కాలం చుట్టేసాక
భుజాభుజాలు రాసుకుని
గొంతులు అరిగెలా తిరిగాక
వేల దృశ్యాలు వృష్టికి
కళ్ళు వరదయ్యాక
మనసు మూతపడి
మాట తప్పుకున్నాక
గుండె శబ్దలే ప్రశ్నలుగా
జావాబులు గుచ్చుకున్నాక
నీడలూ చీకటిలో ఎదురై
నిప్పులా ఎగిసిపడ్డాక
నిజం నిలువుటద్దమై
నిన్నటి రోజును నిలదీసాక
అడుగుతీసి అడుగేస్తే
ముక్కులు పగిలే వాసనతో
నగంగా తప్పులు
ముఖాలపైగా నడిచాక
ఈర్ష్య గాలులకు
పచ్చని చూపులు నల్లగయ్యాక
అసూయావేశం కురిసి
పాదాలు వంకర్లు తిరిగాక
మౌనం ముద్దలుముద్దలుగా
బతుకులో గడ్డకట్టాక
అర్థం అగమ్యమై
జీవితపు అంచులను చేరాక
ముక్కలైన మనసులో
అతుక్కోని ఒక్కచోట
మొలిచిన ఓ గాఢ కోరిక
జీవితంలో మనిషిని చూడాలని ..
కోటానుకోట్ల అడుగులో
ఒక్క అడుగు నా కోరికను విన్నా
మనిషి అబద్దం కాదు..
నా ప్రశ్న వృధా కాదు
బహుశా ఏ మనిషికి తీరని కోరికైతే
నేను పేరాశగా నాది దురాశ
మనిషిని చూపలేని లోకానికి
నిత్యం ఓ పోరాటమే మనిషే....
- చందలూరి నారాయణరావు
9704437247