Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరంటే .. ఆయుధమే గాదు
అడవంతటా పరివ్యాప్తమయ్యే
మోదుగుపూల కాంతి కూడా !
నేను.. పోరు జేస్తూనే ఉంటాను
అడవి కోసం..
ఆదివాసీ గర్భస్త శిశువు కోసం..
బతుకుపచ్చని నవ్వు కోసం..
నెగడై రగులుతూనే ఉంటాను
ఏకమై.. అనేకమై..
దుఃఖమై.. దుర్భేద్య సమూహమై..
గెరిల్లా పోరు సాగిస్తూనే ఉంటాను !
ఈ పచ్చని లోగిలి మీద
ఏ పాపిష్టినీడా పడకుండా..
నడచే యీ నెత్తుటి వనాలు
నేల కూలిపోకుండా..
ఎక్కుపెట్టిన శిలకోల
ఏ చేయీ దించకుండా..
ఆకుల నిఘానేత్రాలతో..
అడవి నలుచెరగులా
నిత్యం పహారా కాస్తూనే ఉంటాను !
నేను.. పోరు జేస్తూనే ఉంటాను
రేపటి పొద్దున
యీ ఆకుపచ్చని ఆకాశం మీద
ఓ వేకువ పువ్వు పూసేదాకా..!!
- సిరికి స్వామినాయుడు,
94940 10330