Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందేండ్ల క్రితం పుట్టి
వేయి ఆలోచనలు పుట్టించి
లక్షల మెదళ్ళలను కదలించి
మన లక్ష్యాన్ని నిర్దేశించిన
మహౌన్నత వీరుడతడు
రజాకార్ల ఆగడాలపై
నిజాం నిరంకుశత్వంపై
దోపిడి పీడనపై
కలాన్ని ఎక్కుపెట్టిన
మన జాతి సాహసకుడు
అరాచకత్వంపై
అక్షరాలతో యుద్ధం చేసి
అమానుషత్వంపై
కవిత్వమనే కొరడా ఝుళిపించిన
అక్షర సైనికుడు
ఇంగ్లీషు మోజులో పడి
పర భాష మత్తులో మునిగి
నీ భాష నీ యాస నీ వేషం మరిచిన నాడు
చావడం నయమంటూ సూటిగా
హెచ్చరించిన అచ్చ తెలుగు ప్రేమికుడు
అన్యాయాన్ని ప్రశ్నించి
సమాజానికి పట్టిన
మురికినంతటినీ కలంతో
కడిగి పారేయాలన్న
తెలంగాణ వైతాళికుడు
కలమొక నిప్పు కణికై
అక్షరం నిత్యం రగిలే జ్వాలై
కవితల తూటాలు పేల్చి
అణిచివేతపై పోరు సలిపిన
ఉద్యమ భాస్కరుడు
నాది బడి పలుకుల భాష కాదు
పలుకుబడుల భాష అని
సగర్వంగా చాటి చెప్పి
జనం భాషకు జై కొట్టిన
జన నాయకుడు
ఉద్యమమే ఊపిరిగా బతికి
సామాన్యుని హక్కులకై పోరాడి
పేదోడి గుండెల్లో దూరి
తెలంగాణ బతుకు వెతలను
కవిత్వీకరించిన సవ్యసాచి
ప్రజల గోడును తన(నా)గొడవగా
మలచిన ధన్యజీవి
నిరాశా దురాశలను దరి చేరనీయక
చావు పుట్టుకలు తప్ప
బతుకంతా తెలంగాణకర్పించిన
త్యాగజీవి మన కాళోజి
(సెప్టెంబర్ 9 కాళోజి జయంతి)
- సలీమ