Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా|| బి.వి.ఎన్. స్వామి, 9247817732
అస్తిత్వ ఉద్యమాల వల్ల వివక్షకు గురయిన శ్రేణుల నుండి రచయితలు పుట్టుకొచ్చారు. ఆ ఫలిత ప్రభావమా అన్నట్లు బాల రచయితలు ఉద్భవించారు. ఇందుకు సాక్ష్యంగా తెలంగాణలో వస్తున్న పిల్లలు రాసిన కథా సంపుటాలు నిలు స్తాయి. అయినను పిల్లల కోసం రాయాల్సి బాధ్యత పెద్దలకు ఉంది. జీవితానుభవం, రాయ గలిగిన నేర్పు, నిబద్ధత కలిగిన రచయితలు ఉన్నారు. సాంకేతిక విప్లవం పరోక్షంగా విలువల క్షీణతకు గురిపెట్టింది. అందుకు బాలలు ఉపకర ణాలయ్యారు. చేతిలోని సెల్ఫోన్ స్వర్గాలను చూపెట్టడం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు గురి అవుతున్నారు. అక్షరం కోసం చరవాణిని ఆశ్రయిస్తే హాని ఎక్కువగానే జరిగింది. సమాజ వీధుల్లో విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈజీమనీ వల్ల అనేక పెడధోరణులు బాలలకు అబ్బినవి. మానవీయ విలువ స్థానంలో మార్కెట్ విలువ తిష్ఠవేసింది. ఈ పరిణామం చాపకింది నీరులా వ్యాపించింది. దాని వల్ల తప్పుడు విలువలు సమాజంలో సాధరణమయ్యాయి. ఇదంతా ఎదుగుతున్న బాలలపై ప్రభావం చూపింది. వారు ఎండమావులనే నీటి చెలిమెలుగా పొరపడుతున్నారు. ఆ పొరపాటును సరిదిద్దాలి. అది బాధ్యత గల పెద్దల పని.
బిడ్డలకు శిక్షణ నివ్వాల్సిన కుటుంబం, విద్యావ్యవస్థ రెండూ కుంటి గుర్రాలయ్యాయి. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరియు విద్యాహక్కు చట్టం ఉపాధ్యాయుల పాత్రను నామమాత్రం చేసాయి. ఆన్లైన్ చదువులు పాఠశాల ఉనికికి ఎసరుపెట్టాయి. కుటుంబ నియంత్రణ ఇంట్లోని పిల్లలకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది. పిల్లల గొంతెమ్మ కోర్కెలను తీర్చడానికి తల్లిదండ్రులు తయారయ్యారు. ఈ దారులన్నీ పిల్లల్ని త్రిశంకు స్వర్గంలో దింపాయి. ఇప్పుడా బాలల్ని భూమార్గం పట్టించాల్సిన బాధ్యత పెద్దలది. సాహిత్య రంగానికొస్తే రచయితలది. ఆ మేరకు కొందరుపెద్దలు ముందుకొచ్చారు. తమ తమ ఆలోచనల ప్రకారం కథల్ని వండి వడ్డించారు. పెద్దల కథలు రాయడానికి కావలసిన సమర్థత కంటే రెట్టింపు శక్తి పిల్లల కథలు రాయడానికి కావాలి. చూసింది చూసినట్లు, తెలిసింది తెలిసినట్లు, విన్నది విన్నట్లు, చదివింది చదివినట్లు రాస్తే పెద్దలకు సరిపోతుంది. అలారాస్తే పిల్లలు పట్టించుకోరు. చేదు వాస్తవాలకు తీపి పూతలు పూసి అందిస్తేగాని పిల్లలు అందుకోరు. అందుకు ఓపిక, శ్రద్ధ మరింత కావాలి. కనుకనే పిల్లల కథలు రాయడం కష్టం.
ఊహాలోకాలు, మాయా ప్రపంచాలు, కీలుగుర్రాలు, మాంత్రికశక్తులు, సాహసకృత్యాలు, క్రూరమృగాలు, సాధుజంతువులు, బాలల్ని అమితంగా ఆకర్షిస్తాయి. వాటిద్వారా చెప్పిన కథలు బాలల్ని మెప్పించాయి. పంచతంత్రం, సింద్బాద్ సాహసయాత్రలు ఆ కోవలోనివే. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాలు ఈ ఒరవడిని మనకు అందించాయి. ఈ విధానం ఇప్పటికీ ఆచరణీయమే. పశుపక్ష్యాదులు, నదీనదాలు మట్లాడుతున్నట్లు, ప్రకృతి శక్తులతో మనిషి పోట్లాడుతున్నట్లు చిత్రించిన కథలు పిల్లల్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచుతాయి. అదే సమయంలో మనం చెప్పదలచిన విషయం అందించాలి. ఆధునిక సాంకేతికత అందించిన పరికరం రోబో. అన్ని పనులు చేయించినట్లే రోబోతో కథలు కూడా చెప్పించాలి. రోబో సాయంతో అంతరిక్ష యానం చేయించి సైన్సును అర్థం చేయించాలి. ఆ విధంగా పిల్లలకు శాస్త్రీయ దృష్టిని అలవర్చాలి. సాంకేతికంగా శిఖరాల్ని అందుకుంటున్న సమాజం, నైతికంగా పాతాళం వైపు పయనిస్తుంది. ఈ క్రమం మానవ జీవనాన్ని సంక్షుభితం చేస్తుంది. ఈ సంక్షోభం నుండి పిల్లల్ని రక్షించే శక్తి బాలసాహిత్యానికి ఉంది. కథ అందుకు దోహదపడుతుంది. విలువల నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం కథల వల్ల సాధ్యపడుతుంది. మొక్కల పెంపకం, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం, సహాయం, త్యాగం, స్నేహం, తల్లిప్రేమ, జంతుప్రేమ, నిజాయితి, మానవత్వం, దేశభక్తి, సమయస్ఫూర్తి, పెంపకం, పరోపకారం, ప్రేమ, అభిమానం, కోపం, ఆత్మీయత, ధైర్యం, పిరికితనం, మొండితనం, దురాశ, స్వార్థం, సాహసం లాంటి లక్షణాల మేలు, కీడులను కథల ద్వారా అందించవచ్చు. శాస్త్రీయ దృష్టి, మార్పుకోసం ప్రయత్నం, ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించికథల ద్వారా అవగాహన కల్పించవచ్చు. వీటిని నేర్పుటకు మనుష్య పాత్రలకు బదులు జంతువులను పాత్రలుగా చేసి చెప్పించాలి. దాంతో పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది.
బాలలు పాఠ్యపుస్తకాలు చదవక తప్పదు. కొంతమంది అవి చదవడానికి ఆసక్తి చూపరు. పాఠ్యప్రణాళికలోని అంశాలకు అనుగుణంగా కథలురాస్తే ఉభయతారకంగా ఉంటుంది. వారికి అవసరమైన స్తన్యం వాటి ద్వారా అందుతుంది. ఎదుగుతున్న పిల్లలకు వయసుల వారీగా చెప్పాల్సిన విషయాలను కరికులం (పాఠ్యప్రణాళిక)లో పొందుపరుస్తారు. అట్టి విషయాలను నేర్పడానికి కథలు ఉపకరిస్తాయి. వీటిని కరికులం కథలు అనవచ్చు. ఆ ధోరణిలో కథలు రాసిన రచయిత పుల్లూరి జగదీశ్వర రావు. ఇతని ''లిటిల్స్'', ''చిలుక సాయం'' అనే కథాసంపుటాల్లో ఈ ధోరణి కనపడుతుంది. ఇతడు తన కథలను ఆంగ్లంలోకి అనువదించి ''బైలింగ్వల్'' కథలుగా అందించారు. ఇలా అందించిన వారు అరుదు.
సమాజంలో జరుగుతున్న ఉద్యమాలు, మార్పులు రచయితను ప్రభావితం చేస్తాయి. అవి రచనలలో కనిపిస్తాయి. బాలల కథ అందుకు మినహాయింపు కాదు. గ్రాంధిక భాష, ప్రామాణిక భాష, వాడుక భాష, మాండలిక భాష లాంటి భావనలు రచయితల మధ్య చర్చలను రేపాయి. పిల్లలు వినడం, మాట్లాడటం అనే రెండు నైపుణ్యాలను బడి బయట నేర్చుకుంటారు. దీనివల్ల వారికి భాష ఒంటబడుతుంది. అలా పట్టుబడిన భాష మాండలిక భాష, ఇంట్లో నేర్చుకున్న భాషను సంస్కరించి, చక్కదిద్ది బడిలో నేర్పేభాష ప్రామాణిక భాష, ఈ రెండు భాషల మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది. మాతృభాషలో అభ్యసన తొందరగా జరుగుతుంది. కనుక మాండలిక భాషలో కథలు రాస్తే పిల్లలకు విషయం అర్థమవుతుందనేది నిజం. ఆ దిశగా ఆలోచించి కథలు రాసి మెప్పించిన వాడు పెండెం జగదీశ్వర్. ''గజ్జెల దయ్యం'', ''పసిడిమొగ్గలు'', ''ఉపాయం'', ''తాను తీసిన గోతిలో'' వంటి కథా సంపుటాలు అనేకం వెలువరించాడు.
పిల్లల కథలు రాసే పెద్దలు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నవి. అందించే విషయంపై స్పష్టత ఉండాలి. అందించాల్సిన పద్ధతిపై అవగాహన ఉండాలి. చెప్పాల్సిన విషయం కథలో ఒదుగుతుందో లేదో తెలిసి ఉండాలి. పిల్లలకు ఆసక్తి కలిగేలా రాయాలి. సులభంగా అర్థం కావడానికి సరళపదాలు వాడాలి. చిన్న చిన్న వాక్యాల ద్వారా విషయం చేరవేయాలి. పదాడంబరం పనికిరాదు. సంక్లిష్ట వాక్యం వాడకూడదు. గూఢార్థం కలిగిన పదాల కన్నా, అలతి అలతి పదాలు వాడటం మేలు. వయసు పెరుగుతున్నా కొద్ది పదాలు, వాక్యాలు, అర్థాలు, భావనల స్థాయి పెంచుకుంటూ పోవడం ఉత్తమం. చిన్న వయసులో రెండు వాక్యాలలో చెప్పిన కథను వయసు పెరుగుతున్నా కొద్దీ పేజీలకు విస్తరింపజేయాలి. దీనివల్ల బాలలకు అక్షర, పద, వాక్య, భావ సంపద పెరుగుతుంది. పిల్లలకు ఊహాశక్తి ఎక్కువ. నేల విడిచి సాము చేయగలరు. పిల్లల్ని కథ ఊహల్లో విహరింపజేయాలి. అద్భుత, సాహస, జానపద కథలు ఊహకు అగ్రపీఠం వేస్తాయి. కనుకనే పిల్లలు ఈ కథలను ఇష్టపడుతారు. ఇలాంటి కథలు రాయడం పెద్దలకు అగ్నిపరీక్షలాంటిది. అందుకే బాలల కథ రాయడం బహుకష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని కథలు రాసిన పెద్దలు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. రాసిన కథల్ని బాధ్యత వహించి పుస్తక రూపంలో తెచ్చే మణికొండ వేదకుమార్ లాంటి ప్రచురణ కర్తలున్నారు. బాల సాహిత్యాన్ని నెత్తికెత్తుకొని పనిచేసే గరిపల్లి అశోక్ లాంటి కార్యకర్తలున్నారు. బాల సాహిత్యం కోసమే కలం పట్టిన డా|| పత్తిపాక మోహన్, జీవితాంతం బాలసాహిత్యం రాస్తూ, పత్రిక, శీర్షికలు నిర్వహిస్తున్న తిరునగరి వేదాంతసూరి లాంటి చాలా మంది ప్రముఖులు తెలంగాణలో ఉన్నారు.
వసుంధర, రాజగోపాలరావులు మొదలుకొని నేడు కలం పట్టిన బాలలకథారచయితల వరకు అందరు కథను బాలల వికాసం కొరకు ఉపయోగించారు. పిల్లల క్షేమం కోసం వారు పడిన తపన కథల్లో కనిపిస్తుంది. తెలంగాణలో పిల్లల కథలు రాస్తూ వివిధ అంశాలను వారి కోసం విశదపరుస్తున్న రచయితలను మరో వ్యాసంలో వివరిస్తాను.