Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను 'ఆంధ్రజ్యోతి'లో చేరిన కొత్తల్లో వీక్లీ సెక్షన్‌కి పురాణం సుబ్రహ్మణ్యం ఎడిటర్... ఆయన ద్వారానే జ్యోతిలో చేరాను. బాలి వీక్లీ సెక్షన్లో ఆర్టిస్టు... జ్యోతిలో ఆ రోజుల్లో డైలీ, ఆంధ్రజ్యోతి వార పత్రిక, జ్యోతి చిత్ర, వనితా జ్యోతి, బాల జ్యోతి వున్నాయి. నేను జ్యోతి చిత్ర సినీ వారపత్రికలో ఆర్టిస్ట్‌గా చేరాను. మాకు తుర్లపాటి కుటుంబరావు ఎడిటర్...
''బాలి గారూ! నాకు మేరేజ్ కుదిరింది సార్!'' అని అన్నాను. అంతే!
''అలాగా!! కంగ్రాట్స్! ఎప్పుడు పెళ్ళి'' అన్నారు అభిమానంగా.
''ఇంకా టైం వుంది సార్. ఆగస్టులో'' అన్నాను.
బాలి వారపత్రికలో కథలకు బొమ్మలు, సీరియల్స్‌కు బొమ్మలు వేస్తూ చాలా బిజీగా వుండేవారు...
నేను బాలితో నా వివాహం నిశ్చయం అయ్యిందని చెప్పగానే ఆయన ఏ మూడ్‌లో వున్నారో తెలియదు కానీ, వెంటనే 'నేను మంచి బొమ్మ వేసిస్తాను' అన్నారు.. నాకు చాలా ఆనందం అయ్యింది... అప్పటికే బాలికి మంచి పేరు వుంది... బాపు తర్వాత బాలినే అనేవారు అందరూ... బాలి ఇల్లు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు దగ్గరలోనే పశువుల హాస్పిటల్ సందులో ఉండేది. ఆఫీసు టైం అయిపోగానే ఇంటి దగ్గర కూడా వర్క్ చేసుకుంటూ వుండేవారు... అప్పట్లో విజయవాడ అంటేనే నవలలు, పుస్తకాలు, పిల్లల బొమ్మల పుస్తకాలు ప్రింట్ అయ్యేవి. పబ్లిషర్స్ అందరూ విజయవారే.. అందరికి బాలి ముఖచిత్రాలు వేసి ఇచ్చేవారు. ఆయన అంత బిజీగా వుంటూనే నా పెళ్ళి కార్డుకి బొమ్మ నేను అడగకుండానే ఇచ్చారు.. అంటే ఆయన మనస్సు ఎంత నిర్మలమైందో.. తోటి కళాకారుల్ని ఎంత ప్రేమగా చూస్తారో అర్థం అవుతుంది...
ఆ బొమ్మ నేను నా పెళ్ళి పత్రిక వేసిన తర్వాత చాలా మంది నా దగ్గర నుంచి ఆ బొమ్మని ఆడిగి వాళ్ళ పెళ్ళి పత్రికల మీద ప్రింట్ చేయించుకున్నారు.. అప్పట్లో ఆ బొమ్మ అంత ఫేమస్ అయ్యింది..
ఆ బొమ్మే ఇప్పుడు మీ కోసం ఇక్కడ వేస్తున్నాను... అదే నా పెళ్ళి కార్డు కూడా...
బాలి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి.. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ లక్ష్మణరావు. తండ్రి బ్రిటిష్ పాలనలో ఆర్మీలో సుబేదార్‌గా ఉద్యోగం చేసేవారు. బాలి తండ్రీ చిత్రకారుడే అన్న విషయం ఇంట్లో వాళ్ళకు తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువులు పెద్ద బాక్స్‌లో పంపితే- అపుడు వాళ్ళకు తెల్సింది.. ఆర్ట్‌కు సంబంధించిన రంగులు, బ్రష్‌లు, వేసిన చిత్రాలు వున్నాయి. అప్పుడే బాలి కూడా అదే దారిలో చిత్రీకరణ పట్ల మొగ్గు చూపారు.
బాలి చదువుతో పాటు చిత్రకళను అభ్యాసం చేస్తూనే వున్నారు. ఆంధ్రజ్యోతి పిల్లల నవల రాసి, దానికి బొమ్మలు కూడా ఆయనే వేసారు. వైజాగ్ ఈనాడు పత్రిక ప్రారంభించినపుడు కార్టూనిస్ట్‌గా పని చేశారు. తర్వాత ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా జాయిన్ అయ్యారు.
బాలి అసలు పేరు మేడిశెట్టి శంకర్రావు. పురాణం సుబ్రహ్మణ్యం 'బాలి' అని నామకరణం చేశారు. అది బాలికి కూడా నచ్చడంతో అలానే కంటిన్యూ చేశారు. ఆ పేరుతోనే ప్రసిద్ధి పొందారు. బాలి తన ఆత్మకథను 'చిత్రమైన జీవితం' పేరుతో రాసుకున్నారు. 'బాలి కార్టూన్స్' పుస్తకం హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో బాపు చేత ఆవిష్కరింపజేశారు. అప్పుడే బాపు గారు బాలిని నేను మీ బొమ్మల అభిమానిని... ''కాళిదాస శృంగార తిలకం'' పుస్తకానికి మీరేసిన బొమ్మలు అద్భుతం అన్నారు.
గుంటూరు కళా పీఠం వారు 'చిత్ర కళా సామ్రాట్' అని బిరుదిచ్చి సత్కరించారు. అలానే ఆంధ్రప్రదేశ్ (అప్పటి) ప్రభుత్వం 'హంస' పురస్కారాన్ని అందించింది.
బాలి ధర్మపత్ని ధనలక్ష్మి 2010లో పరమపదించారు. బాలి కొంత కాలం హైదరాబాద్‌లో వుండి పత్రికలకు బొమ్మలు వేశారు. బాలికి అబ్బాయి, అమ్మాయి. ఇద్దరు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. అబ్బాయి గోకుల్ వివాహం బేగంపేటలోని గ్రీన్‌పార్క్ హోటల్లో జరిగింది. దానికి మిత్రులందరూ హాజరయ్యారు. ఈ మధ్యనే అమెరికాలో మంచు తుఫానుకు కొట్టుకుపోతున్న వారిని రక్షించబోయి తను మరణించాడు. ఆ సంఘటన బాలిని చాలా క్రుంగదీసిందనే చెప్పాలి. అమ్మాయి వైశాలి ఈ మధ్యనే బాలిని చూసి వెళ్ళారు. కొంతకాలంగా అనారోగ్యంగా వుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెల్సి అమెరికా నుంచి వచ్చి వెళ్ళారు.
బాలి హైదరాబాద్‌లో వున్న రోజుల్లో కొంతకాలం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 దగ్గరలో వున్న ప్రేమ్‌నగర్ కాలనీలో వున్నారు. అప్పటికే భార్య చనిపోయిందని చెప్పారు. ఆ దగ్గరలోనే 'ఆంధ్రప్రభ' ఆఫీసు వుండేది. ఆ టైంలో నేను 'ఆంధ్రప్రభ'లో ఆర్టిస్టుగా పని చేస్తున్నాను. అందుకని నేను వీలైనప్పుడల్లా ఆయన్ని కల్సి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొనే వాడిని. తర్వాత కొంతకాలానికి సీతాఫల్ మండి (సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర) లో ఇల్లు తీసుకొని వుండేవారు. ఆ టైం లో కూడా కల్సి యోగక్షేమాలు అడిగి తెల్సుకొనేవాడిని. బాలి కంప్యూటర్ నాలెడ్జి లేకపోవడం వల్ల నన్ను ఫొటో షాపులో కలరింగ్ నేర్పమని అడిగితే కలరింగ్ చెయ్యడం... ముందు మనం గీసిన డ్రాయింగ్‌ను స్కాన్ చేసుకొని ఫొటో షాప్‌లోకి తీసుకోవడం, టూల్స్‌తో ఎలా వర్క్ చేయాలో చూపించాను. కొంతకాలం ఆయన అలానే వర్క్ చేశారు కూడా.
ఓ రోజు బాలికి నేను ఫోను చేస్తే నేను వైజాగ్ వచ్చేశాను, ఇక్కడ నుంచే అందరికి బొమ్మలు మెయిల్ ద్వారా పంపిస్తున్నాను అని చెప్పారు.
ఓ సారి వైజాగ్‌లో పని వుండి బాలికి ఫోన్ చేశాను. ఎంవీపీ కాలనీలో స్వంత ఇంట్లో వున్నారు. వెళ్ళి కల్సి ఓ రెండు మూడు గంటలు సరదాగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గడిపాము. చాలా రోజుల తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళడం వల్లనేమో ఈ రోజు వుండి పొమ్మన్నారు. కాని ఈ సారి వచ్చినప్పుడు తప్పక వుంటానని చెప్పి శెలవు తీసుకుని వచ్చేశాను.
అప్పుడే ఆయన ఇంట్లో బాలి చిత్రించిన బొమ్మ గుమ్మంలో వేలాడుతూ వుంది.. అద్దం వేసి ఫ్రేము కట్టి మరీ పకడ్బందీగా వుంది ఆ బొమ్మ. బహుశా ఆ బొమ్మ తను ప్రత్యేకంగా తన కోసం వేసుకున్నారేమో అనుకుని ఓ ఫొటో తీశాను.
ఆయన వేసిన చిత్రం ఇక్కడ మీ కోసం ప్రచురిస్తున్నాం. నేను ఆయన దిగిన ఫొటో కూడా మీ కోసం..
ఇలా రాసుకుంటూ పోతే చాలా సంగతులే వున్నాయి. బాలి భౌతికంగా మనతో లేకపోయినా ఆయనతో గడిపిన సంగతులు, ఆయన గీసిన చిత్రాలు, రచనలు మనతోనే వున్నాయి. వుంటాయి. ఆయన బొమ్మల్లో మనతోనే వుంటాడు. బొమ్మల్లో చిరంజీవి, రాతల్లో చిరంజీవి. జ్ఞాపకాల్లో చిరంజీవి.. బాలీ నాకిచ్చిన బహుమతి దగ్గర కొన్ని దు:ఖాశ్రువులు.
- భాస్కర్ కె.ఎన్, 9396810060