Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతకాలం నుండి ఆ కాకి
మా యాప చెట్టు మీద గూడు
కట్టుకుని ఉందో తెలియదు కానీ
ఊహ తెలిసినప్పటి నుండీ
దాని వయసు మారనేలేదు
సరిగ్గా.. బువ్వేళప్పుడు..
పదేపదే అది అరిచే అరుపుకి
వార్చిన బువ్వకుండ మీది సిబ్బి తీసి
అమ్మ జాలాట్ల వేయగానే
దుసేరితీగల చిక్కుకున్న మెతుకుల్ని ఆత్రంగా..
ముక్కుతో ముత్యాల్లాగ ఏరుకునేది
అది అరచినప్పుడల్లా..
తోడబుట్టినోడు వస్తే బాగుండని
గలుమకు చూపుల తోరణం గట్టి
ఆశల గంపెత్తుకొని బాయి తొవ్వల
భారంగా కదిలేది అమ్మ
పొద్దస్తమానం ఇంటిని సైనికుడి
లెక్క కాపుగాసే ఆ కాకి
పండుగకో పబ్బానికో
సుట్టాలొచ్చినప్పుడో
మాకంటే ముందే నీసు కూర
భోజనం చేసి ఇంటి మూడుసుట్లూ
అద్దం లెక్కజెక్కేది
కుళ్ళును తుడిచి లోకాన్ని
శుభ్రంజేయ ఏ కల్మషం లేకుండా
తన జాతినంతటినీ
ఏకం చేసే ఆ కాకి..
మనసుల నిండా కుళ్ళు నింపుకొని
సాటివారిపట్ల అసహనం వెల్లగక్కే
నేటి మానవజాతికి
పాఠంజెప్పే గురువేన్ఱేమో..
కాకికి వెయ్యేళ్ళ ఆయుష్షు అని
నాయనమ్మ అంటుంటే..
తరాల వంశ వృక్షానికి నీళ్ళు పోస్తూ
మా బతుకు కథలకు పేజీలు కుట్టేది
ఈ కాకే కదా అని సిత్రపోయేది
దాని గూడుగూలి
ఏ గూటికి దూలమయ్యిందో కాని
దిక్కులేని పక్షైన ఆ కాకి
ఇప్పుడేదిక్కునుందో..ఏకాకిలా..
మొదటి ముద్ద పిసికి
పిట్టగోడ మీద పెట్టిన ప్రతిసారి
గుండెందుకో..
ఆకాశానికి ఆశల దండెంగడ్తది
అప్పుడనంగా వెళ్ళినకాకి
నాన్న రూపంలోనైనా
నన్ను జూస్తందుకొస్తదేమోననీ..
- తుల శ్రీనివాస్, 99485 25853