Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వాక్యాలనే మళ్లీ ఉటంకిస్తూ, వీటికి ఖురాన్తో సంబంధమున్నట్టు అస్పష్టంగా, అనిర్దిష్టంగా సూచించారు. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ లేదా ఎవరైనా అజ్ఞాత పర్షియన్ కవి ఈ పంక్తులకు మూలం అన్నారు. మరికొందరేమో వీటి కర్తత్వాన్ని ఎల్బర్ట్ హబర్డ్ అనే తాత్త్వికునికి ఆపాదించారు. క్వేకర్, గ్రీన్ లీఫ్ విటియర్ లను కూడా వదలక ఈ పంక్తులకు వారితో సంబంధమున్నట్టు అభిప్రాయపడ్డారు కొందరు.
కొన్నిసార్లు ఒక చిన్న కవితకు లేదా దానిలోని చిన్న భాగానికి స్వల్పమైన మార్పులు చేర్పులు చేసి, ఉద్దేశ పూర్వకంగానో, అనాలోచితంగానో తిరిగి రాస్తారు ఇతర కవులు. ఇట్లాంటి సంఘటనలు సాహిత్య చరిత్రలో అరుదుగానే జరుగుతాయి. ప్రసిద్ధ కవి ఎజ్రా పౌండ్ పేరు మీద ఉన్న ఈ చిన్న కవితను చదవండి:
Hast thou 2 loaves of bread/ Sell one + with the dole
Buy straightaway some hyacinths/ To feed thy soul.
The Paris Review, Issue No. 222, (Fall 2017)
(నీ దగ్గర రెండు రొట్టెలు వుంటే/ ఒకదాన్ని అమ్మేసి
నీ ఆత్మ ఆకలిని తీర్చేందుకు/ వెంటనే కొన్ని గులాబీలను కొనుక్కో)
కానీ ఇదే కవిత కొంచెం భిన్నత్వంతో నూట పది సంవత్సరాల ముందే (ఆగస్టు 1907లో)The Century Magazine లో అచ్చైంది. రాసినతని పేరు జేమ్స్ టెరీ వైట్. అందులో ప్రారంభంలో, ''నీ అదష్టం బాగుండక నీ యింట్లో రెండు రొట్టెలు మాత్రమే మిగిలివుంటే...'' అని రాసి వుంది. మిగిలిన పంక్తులలో ఎలాంటి మార్పు లేదు. పైగా కింద ''హిపోక్రటిస్ వరవడిలో...'' అని ఉంది. అంటే టెరీ వైట్ రాసిన ఈ చిన్న కవితకు హిపోక్రటిస్ స్ఫూర్తి అనుకోవాలి. హిపోక్రటిస్ ప్రాచీన కాలపు గ్రీకు వైద్యుడు. గులాబీలను దగ్గర ఉంచుకుంటే మానసిక స్వస్థత చేకూరుతుందని ఆయన అలా రాసి ఉండొచ్చునని భావించే అవకాశముంది ఇక్కడ. కానీ అదే సంవత్సరం చివరలో టెరీ వైట్ ప్రచురించిన ''సాది గులాబీ తోటలో'' అనే పుస్తకంలో మళ్లీ ఇవే పంక్తులు చోటు చేసుకున్నాయి. ఐతే ఈ సారి హిపోక్రటిస్ ప్రసక్తి లేదు. కాబట్టి, పదమూడవ శతాబ్దపు ఫార్సీ కవి ఐన సాది కవిత దీనికి స్ఫూర్తి కావచ్చు అనుకున్నారు కవిత్వాభిమానులు. ఇతర కవుల పంక్తులను తమ రచనలో చేర్చినప్పుడు కొటేషన్ మార్క్స్ పెట్టడాన్ని మరచిపోవడం కొన్నిసార్లు ఇటువంటి తప్పిదాలకు కారణ మౌతుంది. మరికొన్ని సార్లేమో పూర్తిగా ప్రమాదవశాత్తు (accidentally- యాదచ్ఛికంగా) జరుగుతుంది ఈ పొరపాటు.
ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. టెరీ వైట్ 1917 లో ఈ పంక్తులకు మళ్లీ స్వల్పమైన మార్పును చేసి, A Garden of Remembrance అనే తన కవితా సంపుటిలో చేర్చాడు. అట్లా ఆయన తన ఈ చిన్న కవితకు హిపోక్రటిస్ లేదా సాది స్ఫూర్తి అని చెప్పకనే చెప్పినట్టైంది. మొత్తానికి ఈ కవితా పంక్తులకు ప్రాచుర్యం కలిగింది. 1911లో అమెరికాలో మేయర్ పదవికి పోటీ చేసిన జెబ్ హెరిమన్ తన ఎన్నికల ఉపన్యాసంలో ఈ పంక్తులను వాడుకున్నాడు. కొందరు ఈ వాక్యాలనే మళ్లీ ఉటంకిస్తూ, వీటికి ఖురాన్తో సంబంధమున్నట్టు అస్పష్టంగా, అనిర్దిష్టంగా సూచించారు. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ లేదా ఎవరైనా అజ్ఞాత పర్షియన్ కవి ఈ పంక్తులకు మూలం అన్నారు. మరికొందరేమో వీటి కర్తత్వాన్ని ఎల్బర్ట్ హబర్డ్ అనే తాత్త్వికునికి ఆపాదించారు. క్వేకర్, గ్రీన్ లీఫ్ విటియర్ లను కూడా వదలక ఈ పంక్తులకు వారితో సంబంధమున్నట్టు అభిప్రాయపడ్డారు కొందరు. ఎజ్రా పౌండ్ ప్రాంభంలో hast ను చేర్చడమే కాక, one ను one+ గా మార్చాడు. టి. ఎస్. ఎలియట్ రాసిన ద వేస్ట్ ల్యాండ్ లో కూడా hyacinth అన్న పదం ఒకటి రెండు చోట్ల వస్తుంది. మొత్తానికి ఈ చిన్న కవిత వెనుక ఇంత పెద్ద తతంగముంది.
దాదాపు ఇటువంటిదే ఐన ఒక సంఘటన తెలుగు సాహిత్యంలో కూడా సంభవించింది. ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక అనే వాక్యాన్ని కాళోజీ రాశాడని చాలా మంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. నా గొడవ అన్న తన కవితా సంపుటిలోని ఒక కవితలో, ''ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నాడు లార్డ్ బైరన్'' అని రాశాడు కాళోజీ. ఐతే, అన్నాడు లార్డ్ బైరన్ అనే మాటలను పట్టించుకోకుండా, కాళోజీయే దీనికి కర్త అని తప్పుగా వ్యాఖ్యానించారు చాలా మంది. నిజానికి, One drop of ink makes a million think అని రాసినవాడు జార్జ్ గోర్డన్ బైరన్ అనే ఆంగ్లేయ కాల్పనిక కవి. ఈయననే లార్డ్ బైరన్ అని కూడా అంటారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇటువంటి వత్తాంతాలు ఇంకా ఏవైనా ఉన్నాయా?
కొన్నిసార్లు ఇతరుల ప్రసిద్ధ కవితలోని కేవలం ఒక పంక్తి ఒకటి రెండు పదాల మార్పుతో వేరొకరి కవితలో చొరబడవచ్చు. దానికి కారణం ఆ కవితా పంక్తిని రెండవ కవి ఎప్పుడో చదివి దానిచేత బాగా ప్రభావితుడై ఉండటం, తత్ఫలితంగా అది అతని మెదడు అడుగున నిద్రాణంగా పడివుండి చాలా యేళ్ల తర్వాత తన కొత్త కవితలో చొరబడటం జరగవచ్చు. అంటే, inadvertently/unwittingly (తెలియకుండా) అలా జరుగుతుందన్న మాట. కానీ పంక్తులకు పంక్తులు లేదా మొత్తం కవిత మక్కీకి మక్కీగా పునశ్చరణ (రిపీట్) ఐనప్పుడు, దాన్ని ఉద్దేశపూర్వకమైన గ్రంథచౌర్యంగానే భావించాల్సి ఉంటుంది.
- ఎలనాగ